భారత్-పాక్‌ల (Bharath-Pakistan) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif), ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) కు కీలక సూచనలు చేశారు. భారత్‌తో దూకుడు వ్యవహరించవద్దని, దౌత్యమార్గాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అంతేకాదు భారతదేశంతో సంప్రదింపులు జరిపేందుకు వ్యక్తిగతంగా నవాబ్ షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
సైనిక ఉన్నతాధికారులతో సమావేశం
భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న వేళ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 2 రోజుల క్రితం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) కూడా హాజరయ్యారు. ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేకున్నా, కేవలం అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో నవాజ్ షరీఫ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గాలి
ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ, ‘భారత్‌తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలి’ అని తన సోదరుడు, పాక్ పీఎం (Pak PM) అయిన షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif కు సూచించినట్లు తెలిసింది. అంతకాదు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్ నుంచి నవాజ్ షరీఫ్ వచ్చారని, ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు.
భారత్ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయి
పహల్గాం దాడి అనంతరం నవాజ్ షరీఫ్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. భారత్ చర్యలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. భారత్ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని ఆయన ఆరోపించారు. నవాజ్ మాత్రం, దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని ప్రధానికి సూచించినట్లు తెలుస్తోంది.
ఉక్కిరిబిక్కిరి అయిన పాకిస్థాన్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీనితో ఉక్కిరిబిక్కిరి అయిన పాకిస్థాన్, పరువు నిలబెట్టుకోవడం కోసం భారత్‌పై హమాస్ ఉగ్రవాదుల తరహాలో దాడులకు పాల్పడుతోంది. దీనితో దీటుగా స్పందించిన భారత్, పాకిస్థాన్‌కు చెందిన ఫైటర్ జెట్లను, డ్రోన్లను, క్షిపణ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. దీనితో ఇరుదేశాల మధ్య మరింతగా ఉద్రిక్తలు పెరిగాయి.