రక్షణ శాఖ వైమానిక స్థావరాల్లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయాల్లో విండో షేడ్స్‌ను మూసి ఉంచాలని వాణిజ్య విమానాలకు డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తాజాగా కీలక సూచనలు చేసింది.మరీ ముఖ్యంగా పాక్‌తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని కిటికీలను కవర్ చేసేందుకు వస్త్రం లేక మెటీరియల్‌ను తప్పక ఉంచాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేంత వరకు విండో షేడ్స్(Window shades) మూసే ఉంచాలని, అలాగే ల్యాండింగ్ సమయంలో 10 వేల అడుగుల లోపు కిందకు రాగానే విండో షేడ్స్ మూసివేయాలని పేర్కొంది. ఎమర్జెన్సీ కిటికీల దగ్గర మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని తెలిపింది డీజీసీఏ.పాకిస్థాన్‌తో ఇటీవల ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు బదులుగా పాకిస్థాన్ కాల్పులు జరిపింది. డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించగా, వాటన్నింటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
ఉద్రిక్తతలు
ఈ పోరులో భారత్ చేసిన దాడుల్లో పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ పోరులో భారత్ పైచేయి సాధించింది. దీంతో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పులు విరమించుకుందామంటూ ప్రతిపాదించింది. అలా ఇరుదేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. కానీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం అలాగే ఉన్నాయి. దౌత్యపరమైన ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు మరో దేశానికి తమ గగనతలాన్ని నిషేధం విధించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాటించాల్సి
వైమానిక స్థావరాల్లో ఫోటోలు, వీడియోలు తీయవద్దన్న నిబంధన గురించి ప్రయాణికులకు తెలియజేయాలని సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే ఎదుర్కోవాల్సిన చర్యల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ(DGCA) స్పష్టం చేసింది.లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, ఆదంపుర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్‌పూర్,హిండన్, ఆగ్రా, కాన్పుర్, బరేలీ, మహారాజ్‌పూర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్, వైజాగ్‌లోని విమానాశ్రయాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
Read Also : Murder: మత్తుకు బానిసగా మారిన భర్తను చంపేసిన భార్య