ఆపిల్ కంపెనీలో వైవిధ్యం, సమానత్వం, చేరిక (DEI – Diversity, Equity, Inclusion) కార్యక్రమాలను రద్దు చేయాలనే ప్రతిపాదనను వాటాదారులు తిరస్కరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని DEI వ్యతిరేక ఉద్యమంలో భాగంగా, నేషనల్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ అనే కన్జర్వేటివ్ థింక్ ట్యాంక్ ఈ ప్రతిపాదనను తెచ్చింది.
ఆపిల్ పై ఒత్తిడి, వాటాదారుల స్పందన
ఈ ప్రతిపాదన ప్రకారం, ఆపిల్ వైవిధ్య కార్యక్రమాలను తగ్గించాలి, ట్రంప్ DEI వ్యతిరేక విధానాలకు అనుగుణంగా మారాలి. మంగళవారం నిర్వహించిన వాటాదారుల ఓటింగ్‌లో 97% మంది ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆపిల్ మేనేజ్‌మెంట్ DEI కార్యక్రమాల పట్ల నిబద్ధత చూపుతూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది.
ట్రంప్-ఆపిల్ సంబంధం
ఆపిల్ CEO టిమ్ కుక్ గతంలో ట్రంప్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు చైనాలో తయారు చేయబడిన ఐఫోన్లపై సుంకాలు తగ్గించడానికి ఈ సంబంధం ఆపిల్ కు ప్రయోజనం కలిగించింది. గత వారం కుక్-ట్రంప్ భేటీ అయిన తర్వాత,ఆపిల్ అమెరికాలో $500 బిలియన్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే 5 సంవత్సరాల్లో 20,000 ఉద్యోగాలను సృష్టించనుందని తెలిపింది. ఆపిల్ ముందు, కాస్ట్‌కో కంపెనీ వార్షిక సమావేశంలో కూడా ఇదే DEI వ్యతిరేక ప్రతిపాదన సమర్పించబడింది. అయితే, కాస్ట్‌కో కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. కంపెనీలు వైవిధ్య నిబంధనలను వ్యాపార విజయానికి అవసరమైన అంశంగా చూస్తున్నాయి.
DEI వ్యతిరేకుల వాదనలు
నేషనల్ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ అధికార ప్రతినిధి స్టీఫన్ ప్యాడ్‌ఫీల్డ్ మాట్లాడుతూ, “బలవంతపు వైవిధ్యం వ్యాపారానికి మంచిది కాదు” అని అన్నారు. ఆపిల్ తన DEI విధానాలను కోర్టు తీర్పుల ప్రకారం మార్చుకోవాలి అని సూచించారు. DEI కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రావచ్చు అని హెచ్చరించారు.
DEI పై న్యాయపరమైన వ్యాజ్యాలు
ఫ్లోరిడా అటార్నీ జనరల్ జేమ్స్ ఉత్మీర్ ఇటీవల Target పై ఫెడరల్ వ్యాజ్యం దాఖలు చేశారు.
DEI విధానాలను అనుసరించడం వల్ల Target తప్పిద నిర్ణయాలు తీసుకుని వినియోగదారులను దూరం చేసిందని ఆరోపించారు. ఆపిల్ కూడా న్యాయపరమైన మార్పులను పరిశీలించాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపిల్ CEO టిమ్ కుక్ మాట్లాడుతూ, “మేము మా కంపెనీ సంస్కృతిని కొనసాగించాలనుకుంటున్నాం” అన్నారు. కానీ, చట్టపరమైన మార్పులను అనుసరించి DEI కార్యక్రమాల్లో కొన్ని సర్దుబాట్లు చేయాల్సి వస్తుంది అని అంగీకరించారు.
2022లో విడుదల చేసిన చివరి DEI నివేదిక ప్రకారం..
ఆపిల్ ఉద్యోగుల్లో మూడు వంతులు శ్వేతజాతీయులు, ఆసియన్లు ఉన్నారు. దాదాపు మూడింట రెండు వంతులు పురుషులు ఉన్నారు. ఇతర టెక్ కంపెనీలలో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. టెక్ పరిశ్రమలో వైవిధ్యాన్ని పెంచేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ, కొన్ని సంస్థలు DEI కార్యక్రమాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.