దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విదేశీ వ్యవహారాల శాఖ (MEA) నివాస సముదాయంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి జితేంద్ర రావత్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనాన్ని రేపింది. చాణక్యపురిలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన నివాసంలో ఉంటున్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో భవనం పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడి
ప్రాధమిక సమాచారం ప్రకారం, జితేంద్ర రావత్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆయన వ్యక్తిగత జీవితం, ఉద్యోగ ఒత్తిడి లేదా ఇతర ఏమైనా కారణాలు దీనికి ప్రేరేపించాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, కుటుంబ సభ్యులు, సహోద్యోగుల నుంచి సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సూసైడ్ నోట్ లభించలేదు, అయితే ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విదేశాంగ శాఖ వర్గాలు, ప్రభుత్వ అధికారులు దిగ్బ్రాంతి
ఈ సంఘటన విదేశాంగ శాఖ వర్గాలను, ప్రభుత్వ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జితేంద్ర రావత్ అధికారిక బాధ్యతలు నిర్వర్తించడంలో ప్రతిభావంతుడిగా పేరుపొందారు. ఇటీవలి కాలంలో ఆయనకు వచ్చిన ఒత్తిడి, మానసిక సమస్యలు అతడిని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. దేశ సేవలో ఉన్న ఉన్నతస్థాయి అధికారుల మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటన మరొకసారి మానసిక ఆరోగ్య సమస్యల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఉద్యోగ ఒత్తిడి, ఒంటరితనం, ఇతర వ్యక్తిగత సమస్యలు ఎంతటి ప్రముఖులనైనా తీవ్ర స్థితికి నెట్టివేయగలవని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసే అధికారులకు మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.