హైదరాబాద్ (HYD) లో, 2026 నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ (HYD) నగర పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాకు తావు లేకుండా ‘జీరో డ్రగ్స్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
Read Also: TG: రైతుల కోసం ప్రతి మండలంలో లోకల్ మార్కెట్లు ఏర్పాటు
కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలనూ పరిశీలిస్తున్నారు
ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్, వెస్ట్ జోన్ తదితర విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, ఈవెంట్ వేదికల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను మోహరించారు. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, ప్రైవేట్ పార్టీలపై కూడా నిఘా కొనసాగుతుంది.
గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలను నిశితంగా గమనిస్తూ, డ్రగ్స్ సరఫరా చేసే వారు, వినియోగించే వారి జాబితాలను సిద్ధం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. నగరానికి కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలనూ పరిశీలిస్తున్నారు. వేడుకల సమయపాలన విషయంలోనూ కఠిన ఆంక్షలు విధించారు.డిసెంబర్ 31 రాత్రి జరిగే అన్ని పార్టీలు, ఈవెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే ముగించాలన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సంబంధిత పబ్‌లు, హోటళ్లు, క్లబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

అనుమతి ఇస్తే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు
మైత్రీవనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు.నగరవ్యాప్తంగా 120కి పైగా చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌ను రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని, ఇండోర్ ఈవెంట్లలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించరాదని ఆదేశించారు. పబ్‌లు, క్లబ్‌లలో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, అశ్లీల నృత్యాలకు అనుమతి ఇస్తే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ప్రధాన ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై వాహనాల రాకపోకలను నిషేధించనున్నారు.
అయితే విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వేడుకల ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్‌ను మోహరిస్తున్నారు. ప్రతి ఈవెంట్ వద్ద సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరి చేశారు.మద్యం సేవించిన వారు సురక్షితంగా ఇంటికి చేరేందుకు తెలంగాణ ఫోర్-వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రకటించింది. 500 క్యాబ్‌లు, 250 బైక్‌లతో ఈ సేవలు అందించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: