కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం, వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించి, ఆస్తిపై యాజమాన్య హక్కుల కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టర్‌కు బదిలీ అయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ”ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు” అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టుచేశారు. ”ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే” అని అమిత్‌షా అన్నారు.

వక్ఫ్‌కు ఎంత భూమి ఉంది?
ప్రభుత్వ డేటా ప్రకారం, వక్ఫ్‌కు దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వేల తర్వాత భారత్‌లో ఎక్కువభూములుంది వక్ఫ్‌కే. రక్షణ మంత్రిత్వ శాఖకు 17 లక్షల95వేల ఎకరాల భూమి ఉండగా, రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది.

ఎన్ని ఆస్తులున్నాయి?
వంసి పోర్టల్ ప్రకారం, వక్ఫ్‌కు 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులను గుర్తించారు. వీటిలో 97 శాతం ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంసి పోర్టల్ ప్రకారం, 58,890 ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. 4,36,179 ఆస్తుల గురించి సైట్‌లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఫిబ్రవరి 9, 2022 నాటి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటాప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 2,15,000 వక్ఫ్ ఆస్తులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 80,480, ఆంధ్రప్రదేశ్‌లో 10,708, గుజరాత్‌లో 30,881 ఆస్తులు ఉన్నాయి.