ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశుృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు లక్షలమంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందినట్లు సమాచారం. మరో 100 మంది భక్తులు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. మహాకుంభమేళాలో తొక్కిసలాటపై ప్రముఖ మతాధికారి ప్రేమానంద్ పూరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రయాగ్ రాజ్ లోని అధికార యంత్రాంగం భక్తుల భద్రతను గాలికొదిలేసిందని ఆరోపించారు. “అధికారులు వీఐపీ, ప్రముఖులకు సేవలు చేయడంలో నిమగ్నమయ్యారు. సాధారణ భక్తుల వద్ద పోలీసులు, అధికారులు ఎవరూ లేరు. నేను మహాకుంభమేళాకు వచ్చిన ప్రతి వీఐపీ వ్యక్తిని చూశాను. అందరికీ స్థానిక అధికారులు సపర్యలు చేశారు. అందుకే తొక్కిసలాట జరిగింది” అని ప్రేమానంద్ పూరీ మండిపడ్డారు.

మహాకుంభమేళా పర్యవేక్షణ ఏర్పాట్లను భారత ఆర్మీకి అప్పగిస్తే.. వాళ్లు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసేవారని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేవని ప్రేమానంద్ పూరీ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ బాధ్యతలు ఇండియన్ ఆర్మీకు ఇవ్వాలని అఖాడాలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. జనవరి 29 మౌని అమావాస్య సందర్భంగా లక్షల మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు ఆచరించేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహాకుంభమేళాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి