మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ (Mahathir Mohamad) నేడు (జులై 10) శతజయంతిని జరుపుకుంటున్నారు. వందేళ్ల వయసులో కూడా ఆయన ఆరోగ్యంగా, జ్ఞాపకశక్తితో కూడిన చురుకుదనం (Healthy, alert with memory)తో కనిపించడమే కాదు, ఇప్పటికీ ప్రసంగాలు ఇస్తూ ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు.తన దీర్ఘాయుష్క జీవితం వెనుక మాయలు, ఔషధాలు లేవని మహతీర్ స్పష్టంగా చెప్పారు. సూటిగా చెప్పాలంటే, క్రమశిక్షణే ఆయన ఆరోగ్య రహస్యం. ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జీవనశైలి గురించి ఓపికగా పంచుకున్నారు.శరీరాన్ని ఎప్పుడూ చలించాలి. ఖాళీగా ఉండకూడదు. రోజూ నడవడం, పనుల్లో పాల్గొనడం ఆరోగ్యానికి మంచిది, అని మహతీర్ అన్నారు. ఆయన మాటల్లో స్పష్టంగా ఉంది – కఠినమైన జిమ్ వ్యాయామాలకన్నా, సహజ దైనందిన కదలికలే ముఖ్యం.
మెదడు పదునుగా ఉంచాలంటే..
శరీరంతో పాటు మెదడుకూ వ్యాయామం అవసరమని ఆయన అన్నారు. “నిరంతరం చదవాలి, రాయాలి, ఇతరులతో చర్చించాలి,” అని చెప్పారు. పుస్తకాలు, ఉపన్యాసాలు, వ్యాసాలే ఆయన మెదడుకు పదును పెట్టే ఆయుధాలు.ఆహారం విషయంలో మహతీర్ చాలామంది ఊహించని విషయం చెప్పారు. “మితంగా తినాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి,” అని అన్నారు. డైటింగ్‌లో మితిమీరిన పద్ధతులు ఆయనకు ఇష్టం ఉండవు. సాదాసీదా, సమతుల్య భోజనమే ఆయనకు ప్రాధాన్యం.
మానసిక ప్రశాంతతే దీర్ఘాయుష్క రహస్యం
రాజకీయాల్లో ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా, శాంతంగా స్పందించడమే తన మానసిక ఆరోగ్యానికి కారణమని మహతీర్ చెప్పారు. నిరంతరం ఏదో కొత్తది నేర్చుకోవాలనే తపన తనను ఉత్సాహంగా ఉంచిందన్నారు.
వయసు లెక్క కాదు – ఆలోచనా శక్తి ముఖ్యం
మహతీర్ కథనం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది – వయసు శరీరానికి మాత్రమే వర్తించాలి, ఆలోచనలకు కాదు. క్రమశిక్షణ, జిజ్ఞాస, మితాహారమే ఆయన ఆరోగ్య సూత్రాలు.