పసిఫిక్ మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన ఓ జాలరి 95 రోజుల తర్వాత ఒక గస్తీ నౌకకు కనిపించారు. ఈ 95 రోజుల కాలంలో తాను తాబేళ్లు, పిట్టలు, బొద్దింకలు తింటూ ప్రాణాలు నిలుపుకున్నట్లు ఆయన వెల్లడించారు. పెరూకు చెందిన మాక్సిమో నాపా కాస్ట్రోకు 61ఏళ్లు. దక్షిణ పెరూ తీరంలోని మార్కోనా పట్టణం నుంచి డిసెంబర్ 7న చేపల వేటకు వెళ్లారు. పది రోజుల తర్వాత ఒక తుపాను కారణంగా ఆయన పడవ దారి తప్పి ఎటో కొట్టుకు పోయింది. తన దగ్గరున్న కొద్దిపాటి సరుకులతోనే ఆయన కాలం గడపాల్సి వచ్చింది. కాస్ట్రో తప్పిపోయినట్లు గుర్తించిన ఆయన కుటుంబం, ఎక్కడున్నాడో కనుక్కునేందుకు వెతుకులాట ప్రారంభించింది. పెరూ సముద్ర గస్తీ దళాల సాయం తీసుకున్నా ఫలితం లేకపోయింది.

ఏది దొరికితే అది తిని బతికి బయటపడ్డాడు
చివరకు గత బుధవారం తీరం నుంచి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో బోటులో ఉన్న కాస్ట్రోను ఈక్వెడార్ గస్తీ నౌక డాన్ ఎఫ్ గుర్తించింది. అప్పటికే ఆయన బాగా డీహైడ్రేట్ అయ్యి, ప్రాణాపాయ స్థితిలో కనిపించారు.
వర్షపు నీరు పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నానని, ఏది దొరికితే అది తిని బతికి బయటపడ్డానని చెప్పారు కాస్ట్రో. శుక్రవారం నాడు ఈక్వెడార్ సరిహద్దుకు సమీపంలోని పైటాలో తన సోదరుడిని కలిశారు. సముద్ర తాబేళ్లను తిన్నానని, అవి దొరక్కముందు బోటులో ఉన్న బొద్దింకలను, తన దగ్గరకు వచ్చిన పక్షులను చంపి తిన్నానని కాస్ట్రో వివరించారు. గస్తీ దళానికి కనిపించడానికి 15 రోజుల ముందు నుంచి తాను ఏమీ తినలేదని చెప్పారు కాస్ట్రో.
మనవరాలి గురించి ఆలోచిస్తూ గడపడమే శక్తినిచ్చింది
తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన తల్లి, రెండు నెలల మనవరాలి గురించి ఆలోచిస్తూ గడపడమే బతకడానికి తనకు శక్తినిచ్చిందని కాస్ట్రో అన్నారు. “రోజూ అమ్మ గురించి ఆలోచించేవాడిని. బతికేందుకు నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు” అని భావోద్వేగంతో అన్నారు కాస్ట్రో. తన కొడుకు తప్పిపోయినా, తన బంధువులందరూ ఆయన వస్తాడని నమ్మకంతో ఉన్నారని, తాను మాత్రం ఆశలు వదిలేసుకున్నానని కాస్ట్రో తల్లి అన్నారు. కాస్ట్రోను వైద్య పరీక్షల కోసం పైటా పట్టణానికి తీసుకెళ్లి అక్కడి నుంచి రాజధాని లిమాకు తరలించారు. ఆయన సొంతూరు ఇకా ప్రాంతంలోని శాన్ ఆండ్రెస్‌లో ఆయనను స్వాగతిస్తూ వీధులను అలంకరించి పండగలాగా జరిపామని ఇరుగుపొరుగువారు, బంధువులు ఆర్.పి.పి. అనే న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. కాస్ట్రో సుముద్రంలో తప్పిపోయిన సమయంలోనే ఆయన పుట్టిన రోజు వచ్చింది. అయితే, ఇప్పుడు ఆయన బర్త్‌డే ఘనంగా నిర్వహించాలని కుటుంబం భావిస్తున్నట్లు కాస్ట్రో మేనకోడలు లేలా టోర్రెస్ నాపా అన్నారు. “ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఆయనకు పునర్జన్మ.” అన్నారామె.
గతంలో జరిగిన సంఘటనలు
గత సంవత్సరం, రష్యాకు తూర్పున ఉన్న ఓఖోట్స్క్ సముద్రంలో ఒక చిన్న పడవ గాలికి కొట్టుకుపోవడంతో రష్యాకు చెందిన మిఖాయిల్ పిచుగిన్ సముద్రంలో తప్పిపోయి రెండు నెలల తర్వాత దొరికారు. అదే విధంగా, ఎల్ సాల్వడార్‌కు చెందిన జాలరి జోస్ సాల్వడార్ అల్వారెంగా కూడా పసిఫిక్ మహాసముద్రంలో తప్పిపోయిన 14 నెలల తర్వాత తీరానికి చేరుకోగలిగారు. 2012లో మెక్సికో తీరం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన, 2014 ప్రారంభంలో మార్షల్ దీవుల దగ్గర దొరికారు. అల్వారెంగా కూడా వర్షపు నీరు తాగి, తాబేళ్లు తింటూ గడిపానని అప్పట్లో వెల్లడించారు.