దక్షిణ కొరయాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, చెట్లను దహించివేస్తూ.. ఉవ్వెత్తున మంటలు ఎగిసిప డుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చు వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది మాత్రమే కాకుండా 1300 ఏళ్ల నాటి, యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ బౌద్ధ దేవాయలం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరోవైపు ఈ మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది విపరీతంగా కష్ట పడుతోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దావానలం అదుపులోకి రావడం లేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

భారీ నష్టాన్నే మిగిల్చిన కార్చిచ్చు
వారం రోజుల క్రితం దక్షిణ కొరియా ఆగ్నేయ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు భారీ నష్టాన్నే మిగిల్చింది. బలమైన పొడి గాలు కారణంగానే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని.. ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ తెలిపింది. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా వేలాది హెక్టార్ల విస్తీర్ణంలోని అడవులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అలాగే ఇప్పటి వరకు 24 మంది మృతి చెందగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
1300 ఏళ్ల నాటి పురాతన బౌద్ధ దేవాలయం ధ్వంసం
ఇది మాత్రమే కాకుండా కార్చిచ్చు కారణంగా 1300 ఏళ్ల నాటి పురాతన బౌద్ధ దేవాలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ గుడికి గతంలోనే యునెస్కో గుర్తింపు కూడా లభించగా.. కార్చిచ్చు వ్యాపించే అవకాశం ఉన్నందున ఆలయంలోని కళాఖండాలతో పాటు పలు విగ్రహాలను ముందుగానే ఇతర దేవాయలకు తరలించారు.
మంటలు వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు వేరే ప్రాంతాలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. అలాగే 68 శాతం మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని.. కానీ ఉత్తర, దక్షిణ జయోంగ్‌సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయని వివరించారు.