భారతదేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం చేరుకుంది. దీనికి కారణంగా ప్రధాని మోదీ డీమానిడైజేషన్ ప్రక్రియను ప్రకటించిన సమయంలో పేమెంట్ యాప్స్ సామాన్యులకు సైతం దగ్గరయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లింపులు చేసుకునేందుకు భారతదేశంలోని యూపీఐ చెల్లింపు విధానం ప్రజలకు అవకాశం కల్పిస్తున్న వేళ ప్రజలు భౌతికంగా డబ్బును వినియోగించటానికి దూరంగా జరుగుతున్నారు. పైగా జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు దానికి ముందు తెరవటం కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు అంత్యంత చేరువగా మార్చేసింది. ఈ క్రమంలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, నావీపే, క్రెడ్ వంటి అనేక యాప్స్ ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. ప్రజలు ఎలాంటి అదనపు ట్రాన్సాక్షన్ రుసుములు లేకపోవటం వల్లనే ప్రస్తుతం ఈ యాప్స్ విరివిగా వినియోగిస్తున్నారు.

జీఎస్టీ విధించాలని నిర్ణయం
ప్రస్తుతం అమెరికా టెక్ దిగ్గజం భారతదేశంలో కొనసాగిస్తున్న గూగుల్ పే వ్యవస్థ ఇకపై ప్రజల నుంచి చెల్లింపులకు ట్రాన్సాక్షన్ రుసుమును వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే బిల్ చెల్లింపులకు గూగుల్ పే కన్వేయన్స్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించటంతో చాలా మంది వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ సంస్థ లావాదేవీ విలువలో 0.5% నుంచి 1% వరకు రుసుముతో పాటు దానిపై జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దేశంలో యూపీఐ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న వేళ దీనికి అవుతున్న ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేయటానికి UPI లావాదేవీలను మానిటైజ్ చేయడం వైపు టెక్ దిగ్గజం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్యాష్ బ్యాక్స్ ఆఫర్
ఇప్పటికే ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్ పే కూడా వాటర్ బిల్, కరెంట్ బిల్, ఇంటర్నెట్ బిల్, స్కూల్ ఫీజులు, డీటీహెచ్ రీఛార్జ్, మెుబైల్ ఫోన్ రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లో చాలా డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ ఫారమ్ లు క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపులకు చాలా మంచి క్యాష్ బ్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో విజయవంతం అయిన యూపీఐ చెల్లింపు వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. దీనిని దేశంలో వీధి చివరి చిన్న వ్యాపారుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అందరూ వినియోగించటంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తర్వాత బ్రెజిల్, చైనా, థాయిలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు కొనసాగుతున్నాయి.