టాలీవుడ్‌లో తనదైన స్టైల్, మాస్ అప్పీల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం “ఫలక్‌నుమా దాస్” మళ్లీ రీ-రిలీజ్‌కి సిద్ధమైంది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ చిత్రం 2019లో విడుదలై విశేషమైన విజయం సాధించింది. దీంతో విశ్వక్ సేన్‌ని అందరు “మాస్ కా దాస్”అంటుంటారు.ఇప్పుడు, దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత, ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఏప్రిల్ 10న “ఫలక్‌నుమా దాస్” గ్రాండ్ రీ-రిలీజ్ కానున్నట్టు వెల్లడించారు.
కథ
ఫలక్‌నుమా ప్రాంతంలోని దాస్ (విశ్వక్ సేన్) అనే యువకుడి లైఫ్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. దాస్ చిన్ననాటి నుంచే అతడి ఏరియాలో ఉన్న లోకల్ దాదా శంకర్(జీవన్)ను చూసి ఆదర్శంగా తీసుకుని అతడిలా అవ్వాలి అనుకుంటాడు. బాల్యంలోనే తన స్నేహితులతో కలిసి ఓ చిన్న గ్యాంగ్‌ను ఏర్పాటు చేస్తాడు. ఈ గ్యాంగ్‌కు శంకర్ సహకారం కూడా అందుతుంది. స్కూల్ రోజుల్లో శంకర్ గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ, సరదాగా జీవితాన్ని గడుపుతాడు. కాలేజీలో చేరిన తర్వాత దాస్ జీవితంలో ప్రేమ, గొడవలు మొదలవుతాయి. అయితే, ఈ సమయంలో దాదా శంకర్ రవి, రాజు అనే ఇద్దరు వ్యక్తుల చేతిలో హత్యకు గురవుతాడు.శంకర్ మరణంతో దాస్ గ్యాంగ్ ఒంటరిగా మిగిలిపోతుంది. అప్పటి వరకు హాయిగా గడిచిన వీరి జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు వీరు కొత్త మార్గాలు వెతుకుతారు. ఈ క్రమంలోనే ఫలక్‌నుమాలో ఓ మటన్ షాప్‌ను ప్రారంభిస్తారు. దాస్ బిజినెస్ మంచిగా నడుస్తుండటం వలన అక్కడ వ్యాపారం చేస్తున్న రవి, రాజుల బిజినెస్ దెబ్బతింటుంది. దీంతో వీరిద్దరూ దాస్ గ్యాంగ్‌తో గొడవకు దిగుతారు. ఈ ఘర్షణలో ఏం జరిగింది. దాస్‌ని పోలీసులు ఎందుకు వెతుకుతుంటారు. టింక్ అనే వ్యక్తి వలన దాస్ లైఫ్‌లో జరిగిన పరిస్థితులేంటి అనేది ఈ సినిమా కథాంశం.
‘వెళ్లిపోమాకే’, ‘ఈనగరానికి ఏమైంది’ చిత్రాల్లో నటించిన విశ్వక్ సేన్ ఈసారి మెగా ఫోన్ పట్టారు. హీరోగా నటించి తానే దర్శకత్వం వహించారు. మలయాళ సినిమా ‘అంగమలి డైరీస్’కు ఇది రీమేక్. దానిలో కొద్దిపాటి మార్పులు చేసి, హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కించారు. ఇది చాలా చిన్న కథ. ఇలాంటి కథకు కథనం చాలా ముఖ్యం. కానీ, సెకండాఫ్‌లో కథనం చాలా నెమ్మదించింది. సీరియల్ మాదిరిగా సాగదీశారు.