దాదాపు శతాబ్ద కాలం తర్వాత ప్రపంచంలోని కొన్ని దేశాలు యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ – రష్యా మధ్య తలెత్తిన యుద్ధానికి తోడు ఏడాది క్రితం ఇజ్రాయిల్ – పాలస్తీనా, ఇజ్రాయిల్ – లెబనాన్, ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచాన్ని మరో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకెళ్తున్నాయి. ఉక్రెయిన్ – రష్యా మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా ఆ రెండు దేశాలు మాత్రమే కాదు, యావత్ ప్రపంచమే పరోక్షంగా ప్రభావితమై ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌కు వెన్నుదన్నుగా నిలబడి ఆయుధాలు సహా అనేక రకాలుగా సహాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడు ‘శాంతి’ మంత్రం జపిస్తోంది. ఆ దేశంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు, అధికార మార్పిడితో పూర్తిగా దేశం వైఖరే మారిపోయింది. అమెరికా అండ చూసుకుని రష్యాతో పోరాడుతూ వచ్చిన ఉక్రెయిన్‌కు.. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

‘క్రిమియా’ ద్వీపకల్పాన్ని స్వాధీనం
ఉక్రెయిన్ దేశం.. 90వ దశకం వరకు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR)లో భాగంగా ఉండేది. USSR పతనంతో అందులోని దేశాలన్నీ స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఉక్రెయిన్ – రష్యా మధ్య సంస్కృతి, సంప్రదాయాల పరంగా సారూప్యత, ఉక్రెయిన్ రాజధాని ‘కీవ్’ నగరం చరిత్రలో రష్యాకు సాంస్కృతిక రాజధానిగా ఉండడం వంటివి ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు కారణమయ్యాయి. కానీ కాలక్రమంలో రెండు దేశాల్లో పాలకులు మారడంతో వైరం ఏర్పడింది.
నాటో సభ్య దేశాలు సైతం సానుకూలత
అగ్రరాజ్యం అమెరికా సహా 2 నార్త్ అమెరికన్ దేశాలు, 30 యురోపియన్ దేశాలతో ఏర్పడ్డ సైనిక కూటమి “నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)”లో సభ్యత్వం తీసుకుంటే రష్యా ఆక్రమణలను తిప్పికొట్టవచ్చని ఉక్రెయిన్ భావించింది. నాటో సభ్య దేశాలు సైతం ఉక్రెయిన్‌ను చేర్చుకునేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. కానీ రష్యా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే ఉక్రెయిన్ వినకపోవడంతో.. రష్యా ఒక్కసారిగా యుద్ధం మొదలుపెట్టింది. రష్యా ఆక్రమణను వ్యతిరేకించే క్రమంలో నాటో దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలిచాయి. ఆయుధాలు, అస్త్రాలు అందజేసి రష్యాను నిలువరించాయి. ఫలితంగా రష్యాతో మొదలైన యుద్ధం మూడేళ్లు పూర్తయినా కొనసాగుతూ వచ్చింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై ట్రంప్ వ్యతిరేకత
అమెరికాలో డెమోక్రట్ల ప్రభుత్వం పోయి రిపబ్లికన్లు అధికారంలోకి వచ్చారు. డోనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వ్యతిరేకించారు. తాను అధికారంలో ఉండి ఉంటే అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేదే కాదని గతంలోనే పలుమార్లు వ్యాఖ్యానించారు.
అరుదైన ఖనిజాల వెలికితీతకు అనుమతి
శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న అరుదైన ఖనిజాల వెలికితీతకు తమను అనుమతించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనిపై చర్చించి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించారు. అయితే తమకు సైనిక సహాయాన్ని నిలపవద్దని, రష్యా దురాక్రమణ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకపోతే తాము మరింత నష్టపోతామని చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా సైనిక సహాయాన్ని తగ్గించడం సరికాదంటూ కాస్త పరుషంగా మాట్లాడారు. సరిగ్గా ఈ వైఖరే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇన్నేళ్లుగా సాయం చేస్తున్న దేశంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రవర్తించే తీరు ఇది కాదని అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఇద్దరూ మీడియా కెమేరాల ముందే జెలెన్‌స్కీతో వాదులాడారు. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. జెలెన్‌స్కీ లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని ట్రంప్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ తమ దేశానికి వెనుదిరిగారు.