కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం తీసుకోకుండా పనులు జరుగడం లేదని ఆయన ఆరోపించారు. ఇళ్ల దగ్గరే అధికారులు, నేతలు కమీషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈటల మాట్లాడుతూ.. ఇంత అసమర్థత, అవినీతి, సమన్వయ లేకపోవడం ఇంతకుముందు ఎక్కడా చూడలేదని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చాల్సిన ప్రభుత్వం, ప్రజల సంపదను దోచుకునే యత్నం చేస్తోందని ఆరోపించారు. పేదల ఇళ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతిని పాల్పడడం వల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనలను ఈటల గుర్తు చేస్తూ ప్రభుత్వం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటుందని విమర్శించారు. మూసీ నది పక్కన పేదల ఇళ్లను తొలగించిన తర్వాత ఇప్పుడు జవహర్ నగర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల హక్కులను హరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణిగా మారిందని ఈటల ఆరోపించారు. ప్రజలు ఈ కుట్రలను గమనించాలనీ, వాటిని తిప్పికొట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈటల రాజేందర్ చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అవినీతిపై బీజేపీ నేతల ఆరోపణలు, కాంగ్రెస్ నేతల స్పందనలు తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడిని మరింతగా పెంచే అవకాశం ఉంది.