Earthquake : మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో ఇటీవల 12 నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూ ప్రకంపనల ధాటికి అనేక భవంతులు ఊగిపోగా.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఈ భూవిలయం లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం వచ్చిన ఆ భూకంప ధాటికి 2,719 మంది ప్రాణాలు కోల్పోయారని తాజాగా స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపాయి. 4,521 మంది గాయపడగా.. 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.

వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం
ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే పరిస్థితి లేకపోయింది. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రీస్కూల్ కూలిపోవడంతో 50 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు చనిపోయారని ఐరాస సిబ్బంది వెల్లడించారు.
వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు
వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు అవరోధంగా మారాయి. ఈ పరిణామాల మధ్య మృతుల సంఖ్య ఎంతకు చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ తక్షణమే అందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు పిలుపునిస్తున్నాయి.