ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో పాల్గొని మద్యం అలవాటుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు సంగీత ప్రేమికులు, సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు, యువతలో చర్చనీయాంశంగా మారాయి. తన జీవితంలో మద్యం తాగే అలవాటు అస్సలు లేదని, కనీసం సిగరెట్ కూడా తాగనని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఆరోగ్యాన్ని, కెరీర్‌ను మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుంటానని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తన ఈవెంట్స్, షోలలో కూడా మద్యం ఉండదని స్పష్టం చేశారు. ఫుడ్ విషయానికి వస్తే అన్ని రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతామని కానీ మద్యం విషయంలో మాత్రం ఎప్పుడూ తానే ఒక నియమాన్ని పాటిస్తానని తెలిపారు. సినీ పరిశ్రమలో చాలామంది మద్యం అలవాటు వల్ల తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారని, అలాంటి వారిని ఎంతో మందిని చూశానని ఆయన పేర్కొన్నారు.

కెరీర్ కోసం మద్యం దూరం
సినీ పరిశ్రమలో స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాతావరణం కారణంగా కొంతమంది నటులు, సంగీత దర్శకులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మద్యం వైపు మొగ్గుచూపుతుంటారని అన్నారు. కానీ తాను కెరీర్ ప్రారంభించినప్పటి నుండి మద్యం తాగకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నానని దేవిశ్రీ ప్రసాద్ వివరించారు. మద్యం సేవించడం ఒక వ్యసనంలాంటిదని, దానిని అలవాటు చేసుకుంటే వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌కూ చేటు జరుగుతుందని చెప్పారు. తన సంగీత ప్రస్థానాన్ని ఒక అనుభూతిగా చూస్తానని, తాను రూపొందించే ప్రతి పాట వెనుక ఎంతో కష్టం, ఎంతో ప్రేరణ ఉంటుందని చెప్పారు. సంగీత దర్శకుడిగా తనకు రాత్రివేళల్లో పని చేయాల్సిన సమయం ఎక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో కొన్ని మంది మద్యం ఆశ్రయిస్తారని తెలిపారు. కానీ తాను అలాంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్లనే ప్రతి ప్రాజెక్ట్‌లో ఉత్తమమైన ఫలితాన్ని సాధించగలుగుతున్నానని అన్నారు. మద్యంకు అలవాటు పడి కేరీర్ నాశనం చేసుకున్న వారిని ఎంతో మందిని తాను చూశానని పేర్కొన్నారు. అందుకే మద్యం విషయంలో మాత్రం దూరం ఉంటా అని దేవిశ్రీ చెప్పుకొచ్చారు.