మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని గొల్లపల్లి కలాన్ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న కనిష్క్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, అతని పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఈ హఠాన్మరణంతో తీగల కృష్ణారెడ్డి కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

కనిష్క్ రెడ్డి తల్లి తీగల సునరిత రెడ్డి, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్‌గా మూసారాం బాగ్ నుంచి పని చేశారు. తన కుమారుడిని కోల్పోయిన ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, బీఆర్ఎస్ నేతలు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? లేక వేగం అధికమై అదుపుతప్పిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.