హనీమూన్(Honeymoon) కోసం మేఘాలయ(Meghalaya)వెళ్లి కనిపించకుండాపోయిన ఇందోర్(Indore) నవ దంపతుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జంటలో ఇద్దరూ తొలుత కనిపించకుండా పోయినప్పటికీ అనంతరం భర్త రాజా రఘువంశీ(Raja Raghuvamshi) మృతదేహం దొరికింది. తాజాగా ఆయన భార్య సోనమ్ రఘువంశీని, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు మేఘాలయ పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులు ఎదుట సోనమ్ రఘువంశీ సరెండర్ అయినట్లు మేఘాలయ పోలీసులు తెలిపారు. మేఘాలయ పోలీసులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని, తన కూతురు అమాయకురాలని సోనమ్ రఘువంశీ తండ్రి దేవి సింగ్ అంటున్నారు.
అసలేంటి ఈ కేసు?
ఇందోర్‌లోని సకర్ నగర్‌కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీ, 27 ఏళ్ల సోనమ్‌లకు ఇటీవలే పెళ్లి అయింది. హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయ వెళ్లారు. మే 23న వారు కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత జూన్ 2న రాజా మృతదేహం ఈస్ట్ ఖాసి హిల్స్‌లోని వీసాడాంగ్ ఫాల్స్‌కు సమీపంలో 150 అడుగుల లోతులో లభ్యమైంది. కానీ, భార్య సోనమ్ మాత్రం కనిపించలేదు. రాజా రఘువంశీ మృతదేహం జూన్ 4 బుధవారం సాయంత్రం మేఘాలయ నుంచి వారి స్వగృహానికి తరలించారు. మే 23న అదృశ్యమవడానికి ఒక రోజు ముందు వారు మేఘాలయాకు చేరుకున్నారు. వారిని చివరిసారి షిపారా హోమ్‌స్టే నుంచి బయటికి వచ్చినప్పుడు చూశారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులను, టూరిస్ట్ గైడ్లను ప్రశ్నించారు. కానీ, ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు.
మేఘాలయ, ఇందోర్ పోలీసులు ఏం చెబుతున్నారు?
ఈ కేసులో రాజా భార్య సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోవడంతో, ఆమెను అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇదాశిశా నాంగ్రాంగ్ చెప్పారు. అర్థరాత్రి జరిపిన దాడిలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం.. ”ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశాం. మరో ఇద్దరు నిందితులను ఇందోర్‌లోని సిట్ అదుపులోకి తీసుకుంది. సోనమ్ సరెండర్ అయ్యారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశాం” అని తెలిపారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక ధాబా నుంచి సోనమ్ రఘువంశీని అరెస్ట్ చేసినట్లు ఇందోర్ పోలీసులు చెప్పారు.
కనిపించకుండా పోయిన రాజా, సోనమ్‌లను వెతికేందుకు ఇందోర్, మేఘాలయ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయని ఇందోర్ పోలీసు కమిషనర్ సంతోష్ సింగ్ తెలిపారు.
‘నా కూతురు అమాయకురాలు’
సోనమ్ రఘువంశీ అమాయకురాలని, తన కూతురిపై పూర్తి నమ్మకం ఉందని, తానిలాంటి పనులు చేయదని తండ్రి దేవి సింగ్ చెప్పారు. ”రెండు కుటుంబాల అంగీకారం, వారిద్దరి సమ్మతితోనే పెళ్లి జరిగింది. తొలి రోజు నుంచి మేఘాలయ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. అరెస్ట్ అయిన వాళ్లంతా ఎవరో ప్రభుత్వం చెప్పాలి. నా కూతురు ఘాజీపూర్ వెళ్లింది. ధాబా నుంచి ఆమే కాల్ చేసింది. పోలీసులు ధాబాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చారు. నేను సోనమ్‌తో మాట్లాడలేదు” అని దేవి సింగ్ తెలిపారు. ”ఎందుకు అమ్మాయి హత్య చేస్తుంది? అలా అయితే, వారెందుకు వాక్‌కు వెళ్తారు? దీనిపై సీబీఐ విచారణ జరపాలని నేను అమిత్ షా గారిని అభ్యర్థిస్తున్నా. మేఘాలయ పోలీసులు కథను అల్లుతున్నారు.” అని చెప్పారు.
మరోవైపు రాజా పర్సు, ఆభరణాలు, ఇతర వస్తువులు పోయినట్లు రాజా కుటుంబం చెబుతోంది. కిడ్నాప్ చేసి, హత్య చేసి ఉంటారని రాజా అన్న సచిన్ రఘువంశీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆయన కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.
Read Also: Honeymoon murder: మా అబ్బాయి నిర్దోషి అంటున్న తల్లి, సోదరి