అస్సాంలోని హోజాయ్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల రోస్మితా హోజాయ్ అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పరీక్ష రాయడానికి ఢిల్లీకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదృశ్యమవడం, చివరికి ఆమె శవమై తేలడం, ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు దారితీసింది.ఆమె జూన్ 4న RRB పరీక్ష కోసం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లింది. జూన్ 5న సాయంత్రం ఆమె తన తల్లికి ఫోన్ చేసి రైలులో తిరిగి వస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఆమె మృతదేహం బయటపడేంతవరకూ ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆమె ఫోన్ పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అదుపులోకి
పోలీసులు, రోస్మితా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. హేమంత్ శర్మ, పంకజ్ కోకర్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రోస్మితా నదిలో కొట్టుకుపోయిందని వారిద్దరూ పోలీసులకు చెప్పారు. అయితే, వారు చెప్పిన విషయాలపై రోస్మితా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చివరి సారిగా ఢిల్లీలో కనిపించిందని, ఉత్తరాఖండ్‌లో ఎలా కొట్టుకుపోయిందో అర్థం కావడం లేదని వారు అంటున్నారు.
కనిపించకుండా పోవడం
రోస్మితా హర్యానాలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం గౌహతిలో ఉంటూ అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APSC) పరీక్షకు సిద్ధమవుతోంది. ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, ఆపై అనుమానాస్పదంగా మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఢిల్లీలోని అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్
ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ,‘రోస్మితాతో చివరిసారిగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాము. విచారణ ప్రారంభించాము. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణం తెలుస్తుంది’ అని తెలిపారు.రోస్మితా కుటుంబ సభ్యులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలు పలు రాష్ట్రాలతో సంబంధం ఉండటంతో ఢిల్లీ, ఉత్తరాఖండ్ , అస్సాం పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నారు.
అనేక అనుమానాలను
రోస్మితా కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది. కుమార్తె ఇక లేదన్న వార్త వారిని కుంగదీసింది. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలుస్తానని రోస్మితా(Rosmita) చెప్పిందని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రోస్మితా ఎలా మరణించింది? ఆమెను ఎవరైనా హత్య చేశారా? హత్యకు ముందు ఏం జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Meghalaya Murder: కిరాయి హంతకుల ప్రయత్నం.. తానె హతమారుస్తానన్న సోనమ్