పల్లి గింజ ఏడాదిన్నర పసివాడి ప్రాణం తీసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి కథనం ప్రకారం గుండెల వీరన్న, కల్పన దంపతులకు కుమారుడు అక్షయ్ శివ ప్రేమ్‌కుమార్ ఉన్నాడు. ఈ నెల 7న ఆటాడుకుంటూ ఇంట్లో ఉన్న పల్లి గింజను మింగాడు. పొరబోయి బాలుడు దగ్గుతుండగా గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయించగా పల్లి గింజ గొంతులో కాకుండా ఊపితిత్తుల్లోకి చేరిందని గుర్తించారు.
చికిత్స పొందుతూ మరణించాడు
రెండు రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్వాస ఆడక ఆదివారం ఉదయం మరణించాడు. ఇద్దరు కుమార్తెల తర్వాత మూడో సంతానంగా కుమారుడు జన్మించడంతో ఎంతో సంతోషించిన ఆ కుటుంబం, కళ్లెదుటే పసివాడి మరణంతో తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేశాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.