రాజా రఘువంశి హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భార్యే తన ప్రియుడి కోసం సుపారీ ఇచ్చి మరీ రాజా రఘవంశి (Raja Raghavamshi) ని చంపించింది. అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను చంపించిన తర్వాత తాను కూడా హత్యకు గురైనట్లు అందరినీ నమ్మించేందుకు వీరు ప్లాన్ చేశారు. ముఖ్యంగా మరో మహిళను చంపి ఆ మృతదేహాన్ని కాల్చేసి, ఆపై రాజా రఘువంశి మృతదేహం పక్కన ఉంచాలనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు వారు వెళ్లిన ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్లాన్ బెడిసి కొట్టింది. అయితే ఈ విషయాలన్నీ విచారణలో తేలినట్లు నేరుగా పోలీసులు వెల్లడించారు.
ప్రధాన సూత్రధారి
మే 11వ తేదీన రాజా, సోనమ్ వివాహం జరగకముందే ఈ హత్యకు పథక రచన చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా (Raj Kushwaha) నే కుట్రకు ప్రధాన సూత్రధారి కాగా సోనమ్ సహ కుట్రదారుగా వ్యవహరించినట్లు ధ్రువీకరించారు. వీరి ప్రథకం ప్రకారం, రాజా హత్య తర్వాత సోనమ్ అదృశ్యమైనట్లు అందరినీ నమ్మించాలనుకున్నారు. అందుకోసం ఆమె నదిలో కొట్టుకుపోయినట్లు చిత్రీకరించాలని భావించారు. లేదా మరెవరైనా మహిళను చంపేసి, సగం కంటే ఎక్కువగా కాల్చేసి ఆ మృతదేహాన్ని సోనమ్ మృతదేహంగా చూపించాలని పథకం వేసుకున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్లాన్ ప్రకారమే సోనమ్ తన భర్త రాజా రఘువంశిని మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకువెళ్లింది.
బస్సులలో ప్రయాణిస్తూ
అక్కేడే మే 23వ తేదీన సుపారీ ఇచ్చిన ముగ్గురు నిందితులు, సోనమ్ కళ్లెదుటే రాజాను దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం సోనమ్ బురఖా ధరించి టాక్సీ, బస్సులలో ప్రయాణిస్తూ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) కు పారిపోయింది. ముందుగా గువాహటిలో రఘువంశిని చంపాలని చూసినప్పటికీ అక్కడ పర్యటకులు ఎక్కువగా ఉండడంతో అది కుదరలేదు. దీంతో నిందితులు షిల్లాంగ్‌కు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇవన్నీ కుదరకపోతే ఫొటో తీసుకుందామన్న నెపంతో తానే భర్తను లోయలోకి నెట్టేస్తానని కూడా సోనమ్ తన ప్రియుడికి చెప్పినట్లు సమాచారం.
అతడిని చంపేందుకు
భర్తను తానే చంపించానన్న విషయం బయటకు రాకుండా ఉండడానికి కిడ్నాప్ అయినట్లుగా నాటకం ఆడాలనుకుంది. ముఠా నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతూ బాధితురాలిగా నాటకం ఆడింది. కానీ రాజా మృతదేహానికి దగ్గర్లోనే అతడిని చంపేందుకు వాడిని ఆయుధం, వారు రెంటుకు తీసుకున్న బైకు, సోనమ్ (Sonam) రెయిన్ కోట్ దొరికాయి. వాటన్నింటినీ ఆధారాలుగా తీసుకుని పోలీసులు దర్యాప్తు చేయగా సోనమ్, రాజ్ కుశ్వాహాల మోసం బయట పడింది. హత్య చేసిన ముగ్గురు నిందితులు సహా వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ప్రస్తుతం విచారణ జరపుతున్నారు.
కొత్త విషయాలు
పోలీసులు,90 రోజుల్లోనే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఈ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుండగా, మరింత లోతైన కుట్ర కోణాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులందరినీ కఠినంగా విచారించి, ఈ దారుణమైన హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Air India: ఎయిర్ ఇండియాకి బాంబు బెదిరింపు కలకలం..అత్యవసర ల్యాండింగ్