బెంగళూరులో మానవత్వం మంటగలిసే ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ బాలికకు అక్కడి కానిస్టేబుల్ నుంచి నరకయాతన ఎదురైంది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు మరింత దారుణంగా మోసపోయింది. ఈ ఘటన గత ఏడాది జులైలో జరిగినప్పటికీ, తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం, విక్కీ అనే యువకుడు స్నేహం పేరుతో దగ్గరై, ఆమెను మోసగించి పలుమార్లు అత్యాచారం చేశాడు. న్యాయం కోసం బెంగళూరులోని మైకో లేఔట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ సదరు బాలికకు సహాయం చేస్తానని నమ్మబలికాడు.
మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి దారుణం
అనంతరం మాయమాటలు చెప్పి, ఓ హోటల్ కు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై వీడియోలు తీసి ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరించాడు.
తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ ఘటన వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన బాలిక చాలా రోజుల పాటు ఎవరికీ చెప్పలేదు. అయితే, ఇటీవల తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆమె తల్లి మైకో లేఔట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోక్సో కేసు నమోదు
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి, సదరు యువకుడు విక్కీతో పాటు కానిస్టేబుల్ అరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోక్సో (ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్‌లో ఉండగా, ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
కఠిన చర్యలుఅవసరం
ఈ ఘటనపై న్యాయవాదులు, మహిళా హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం కోసం వెళ్ళిన బాధితురాలు అక్కడే మోసపోవడం సమాజం లోపాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తోంది. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘోరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి.ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నియమాలు అమలు చేయాలి.