రజినీకాంత్.. ఇది కేవలం ఒక పేరు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ప్రభావితం చేసే ఒక మహామంత్రం. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, అభిమానుల అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. సినిమా ఓపెనింగ్స్ నుంచి మొదలుకొని, ప్రతి విషయంలోనూ ఆ సినిమా సృష్టించనున్న రికార్డుల గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి చర్చల్లో నలుగుతున్న సినిమానే ‘కూలీ'(Coolie).
‘కూలీ’ పై భారీ అంచనాలు
‘విక్రమ్’ సినిమాతో కమల్ హాసన్‌కి కెరీర్‌లోనే పెద్ద హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్, ‘కూలీ’ (Coolie) సినిమాకి దర్శకుడు. లోకేశ్‌కు యాక్షన్ సినిమాలపై ఎంత పట్టు ఉందనేది ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు ఆ యాక్షన్ కి రజినీకాంత్ స్టైల్ తోడైతే ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందువలన ఆగస్టు 14 కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రజినీకాంత్ మాస్ అప్పీల్, లోకేశ్ కనగరాజ్ యాక్షన్ స్టైల్ కలయిక ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించేలా చేస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ఈ అంచనాలకు తగ్గట్టుగానే జరుగుతోంది.

తెలుగు రైట్స్ కోసం పోటీ
ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించడానికి అన్నపూర్ణ – సితార సంస్థలు సిద్ధంగా ఉన్నాయనే ఒక టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగులో ‘జైలర్’ చేసిన సందడిని ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఆ ప్రభావమే ‘కూలీ’ రేటు పెంచుతోందని అంటున్నారు. ‘జైలర్’లో మాదిరిగానే, ఈ సినిమా కోసం కూడా తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల నుంచి స్టార్స్ ను తీసుకోవడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా తెలుగు రైట్స్ ఎవరికి దక్కుతాయనేది.
‘కూలీ’ -రజినీ స్టైల్, లోకేశ్ మార్క్
రజినీకాంత్ చిత్రాలకు ఉండే ప్రత్యేక ఆదరణ, లోకేశ్ కనగరాజ్ టేకింగ్ ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. యాక్షన్, డ్రామా, రజినీకాంత్ మార్క్ మ్యానరిజమ్స్ కలగలిపి ఈ సినిమాను ఒక కార్నివాల్‌లా మారుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ‘జైలర్’ విజయం తర్వాత రజినీకాంత్ తన తదుపరి చిత్రాలను మరింత జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించడం ఈ సినిమాకు ఒక సానుకూల అంశంగా మారింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కూలీ’ సినిమా, రజినీకాంత్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.
Read also: Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి బిగ్ అప్‌డేట్