తమిళ హీరో సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమా చిత్రీకరణ పనులు ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని రజనీకాంత్ స్వయంగా తెలిపారు. గురువారం చెన్నై విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతోంది. సినిమా పూర్తి కావడానికి డిసెంబర్ అవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ‘జైలర్’ మొదటి భాగం సృష్టించిన సంచలనమే. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
ప్రాధాన్యత
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఈ ఏడాది మార్చి 10న చెన్నైలో ప్రారంభమైంది. ఆ తర్వాత కేరళలోని అట్టపాడిలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ(Ramya Krishna) నటిస్తున్నారు. జైలర్ 2 మొదటి రోజు షూట్, అంటూ ఆమె గతంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే, మొదటి భాగంలో రజినీకాంత్ కోడలిగా నటించిన మిర్నా మీనన్(Myrna Menon) పాత్రకు సీక్వెల్‌లో మరింత ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
కీలక పాత్ర
మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించి విజయంలో కీలక పాత్ర పోషించిన అనిరుధ్ రవిచందర్ ‘జైలర్ 2’కి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్(Superstar Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal) కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన మహిళ బయటపడ్డ భద్రతా వైఫల్యం