వారానికి ఎంత చికెన్ తింటున్నారు? ఆరోగ్యంపై ప్రభావం ఏమిటి?
ఒకవైపు చికెన్ రుచికి, ప్రోటీన్ సమృద్ధికి ప్రసిద్ధి. మరోవైపు, దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు కూడా ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాకు చెందిన న్యూట్రియెంట్స్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ స్టడీ ప్రకారం, వారానికి ఎన్ని సార్లు, ఎంత పరిమాణంలో చికెన్ తీసుకుంటున్నామన్నదానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉందని తేలింది.
చికెన్ లో ప్రోటీన్లు, విటమిన్ బి12, కొలైన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థను మెరుగుపరచడంలో, శరీర బలం పెంపొందించడంలో సహాయపడతాయి. పిల్లలకు కూడా చికెన్ తినిపించడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, రుచిలో మునిగిపోతూ చికెన్‌ను అధికంగా తీసుకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని స్టడీ హెచ్చరిస్తోంది.
వారానికి ఎంత మాంసం తినాలి?
అధ్యయనం ప్రకారం, వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే ఆరోగ్యపరంగా ముప్పు ఉండే అవకాశముంది. ఇదే కాక, 200 గ్రాముల చికెన్ తీసుకున్న వారి లో కూడా కొన్ని కేసుల్లో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ గుర్తించారు. అదీ కాకుండా, అధిక మాంసం తీసుకున్నవారిలో సుమారు 27 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. పురుషుల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
అందుకే, ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే మాంసం తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిమిత మోతాదులో, దాదాపు 100 గ్రాముల చికెన్ వారానికి తీసుకుంటే ఆరోగ్యపరంగా ముప్పు ఉండదని అధ్యయనం స్పష్టం చేసింది.
మాంసం బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
ప్రొటీన్ కోసం చికెన్ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదు. బీన్స్, బఠాణి, వెజ్ సలాడ్స్, నట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చడం ద్వారా సరిపడా ప్రొటీన్ పొందొచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి, క్యాన్సర్ వంటి ప్రమాదాలను దూరం చేస్తాయి. ముఖ్యంగా, రెడీమీట్ లేదా ప్రాసెస్‌డ్ మీట్ తినడం తగ్గించుకోవడం వల్ల ఈ ప్రమాదాలు ఇంకా తగ్గుతాయి.
బయట తినే అలవాట్లపై జాగ్రత్తలు
ఇప్పుడు చాలామందికి రెస్టారెంట్లు, హోటల్స్‌లో తినడం అలవాటైంది. వీకెండ్స్, సెలవులు వచ్చేసరికి బయటకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి బిర్యానీ, చికెన్ ఆర్డర్ చేయడం కామన్. కానీ, బయట తినే మాంసంలో అధికంగా రసాయనాల వాడకం, ప్రాసెసింగ్ వల్ల ప్రమాదం ఇంకా పెరుగుతుంది. అందువల్ల వీలైనంత వరకూ ఇంట్లోనే శుభ్రంగా, తక్కువ మసాలాలతో వండిన చికెన్‌నే తీసుకోవాలి.
మితంగా తింటే ఆరోగ్యమే
చివరగా చెప్పాలంటే, చికెన్ తినడం తప్పు కాదు. కానీ మితిమీరిన వాడకం తప్పనిసరిగా అనారోగ్యానికి దారితీస్తుంది. ఒక్కోసారి తినడం, పరిమిత మోతాదులో తినడం వల్ల మాత్రం శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డైట్‌లో మాంసం పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మైనరల్‌లు, విటమిన్లు అందుతాయి.
READ ALSO: Patanjali Research: బ్రెస్ట్ క్యాన్సర్‌కు పతంజలి పరిశోధనలో కీలక అంశాలు