భారతీయ సాంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది వంటల్లో మాత్రమే కాకుండా, వైద్యంలో, సౌందర్య సంరక్షణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ముఖానికి పసుపు రాయడం అనేది పురాతన కాలం నుండి అనుసరించే చక్కటి పద్ధతి. పసుపులో ఉండే ఔషధ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.పసుపు వంటల కోసం మాత్రమే ఉపయోగించే సుగంధ ద్రవ్యం కాదు, ఇది సహజ ఆయుర్వేద ఔషధంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
కర్కుమిన్
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కర్కుమిన్ చర్మ సంబంధిత అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ,మొటిమలు, మచ్చల నివారణ
పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో మొటిమలను తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరిచి, చర్మంపై హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. తద్వారా మొటిమలు రాకుండా నిరోధిస్తుంది.
చర్మం కాంతివంతంగా, యవ్వనంగా
పసుపులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాలుష్యం, హానికరమైన యూవికిరణాల నుండి రక్షిస్తాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మ రంగును మెరుగుపరచడం
పసుపు మెలనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది. అధిక మెలనిన్ వల్ల చర్మం నల్లబడడం, పిగ్మెంటేషన్ సమస్యలు ఏర్పడతాయి. పసుపు సహాయంతో చర్మం సమతుల్యమైన రంగుతో, ప్రకాశవంతంగా ఉంటుంది.
గాయాలు త్వరగా నయం అవ్వడం
పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటంతో, చిన్న గాయాలు, కోతలు, కాలిన గాయాలు త్వరగా మానిపోతాయి. ఇది చర్మ పునరుత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
చర్మ వ్యాధులకు ఉపశమనం
ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మవ్యాధుల వల్ల కలిగే దురద, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది.
సూర్యరశ్మి రక్షణ
పసుపు యూవి కిరణాల ప్రభావాన్ని తగ్గించి, చర్మాన్ని సన్‌బర్న్, నల్లబడడం, క్యాన్సర్ ప్రమాదాల నుండి రక్షిస్తుంది.
చర్మాన్ని తేమగా ఉంచడం
పసుపు చర్మ కణాలలో తేమను నిల్వచేయడంలో సహాయపడుతుంది. ఇది పొడిబారిన చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది.
పసుపును ఎలా ఉపయోగించాలి
శనగపిండి, పెరుగు, తేనె, పాలు వంటి సహజ పదార్థాలతో కలిపి ముఖానికి మాస్క్‌గాఉపయోగించవచ్చు. పసుపు పొడిని నీటితో లేదా రోజ్ వాటర్‌తో కలిపి మొటిమలపై రాయాలి.పసుపు ను ముఖానిపైమర్దన చేసుకోవడం ద్వారా చర్మానికి మెరుగైన పోషణ లభిస్తుంది.
పసుపు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు
కొంతమందికి పసుపు అలెర్జీ ప్రతిచర్యలను కలిగించవచ్చు. కాబట్టి, మొదటిసారి ఉపయోగించే ముందు చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.ముఖ్యమైన వేడుకలకు ముందుగా ఉపయోగించడాన్ని నివారించండి.అధిక పరిమాణంలో వాడితే చర్మం ఎర్రబడే అవకాశం ఉంటుంది.