Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ దిశగా ‘జీరో పావర్టీ పీ-4. మార్గదర్శి-బంగారు కుటుంబం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ అని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పేదరికాన్ని నిర్మూలించేందుకు పనిచేయనున్నారు.ఈరోజు అమరావతిలో సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. అలాగే, పీ-4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ (swarnaandhrap4@ap.gov.in)ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. అదే విధంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మానుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని కుటుంబాలను ఎంపిక చేసి, వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ పథకం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలు ఈ పథకంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.