మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి
హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ , ఏపీ మధ్య జరుగుతున్న చర్చలు.. దానిపై కేంద్రం స్పందనపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ళ పంపకం ఒకటి అన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కోదండరాం మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కృష్ణా జలాల నీటి వివాదంపై గత పదేళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నారు.

టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తాం
ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తాము పోరాటం చేస్తామని ముందుకు రావడం హాస్యాస్పదం అన్నారు. గత పదేళ్లలో మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీజేఎస్ మద్దతు కోరిందని కోదండరాం మీడియాకు తెలియజేశారు.
ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఫిర్యాదు
కాగా, ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ రాశారు.