తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రైతుల కోసం రైతు భరోసా, రైతు రుణ మాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించింది. త్వరలోనే చేనేత కార్మికులకు రుణ మాఫీ చేసే ప్రణాళికను సిద్ధం చేసింది. తాజా నిర్ణయంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
3 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, వారి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు రూ.3 వేల కోట్లతో కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకాలను వచ్చే రెండు నెలల్లో అమలు చేయాలని సంబంధిత శాఖలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. పథకాల అమలు కోసం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
గురుకులాలు, హాస్టల్స్ అభివృద్ధికి చర్యలు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అవాంతరాలు కలగకుండా సంక్షేమ హాస్టల్స్ మరియు గురుకులాల్లో ఎప్పటికప్పుడు అద్దెలు, డైట్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు నూతన విద్యా విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సోలార్ పవర్
పోడు భూముల్లో సోలార్ పవర్ ఆధారంగా సాగు విస్తీర్ణం కూడా పెంచాలన్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు రైతులకు మేలు జరిగేలా కొత్తగా అవకాడో, వెదురు వంటి పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండేళ్లలో ఫలితాలు వచ్చేలా చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ శాఖల్లో పథకాల అమలు కోసం ఎన్ని నిధులైనా ఖర్చుచేస్తామని ఈ సందర్భంగా భట్టి స్పష్టం చేశారు.
దిశానిర్దేశం
కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల ఖర్చుకు వినియోగపత్రాలు సమర్పించి, వెంటనే నిధులు రాబట్టాలన్నారు. సంక్షేమ గురుకులాలు, హాస్టల్స్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారుల పర్యటనలు నిరంతరం కొనసాగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధుల ఖర్చుపై అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు ఆలస్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ కొత్త స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెడుతోంది. రూ.3 వేల కోట్లతో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పథకాల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు అధికారుల పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.