తెలంగాణ రాష్ట్రంలో జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పునర్విభజనతో రాష్ట్రానికి కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు మరియు 7 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా ఆధారంగా స్థానాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం చేయబోతోందని మంత్రి వివరించారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని ప్రాతినిధ్య స్థానాలు రావడం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల అభ్యర్థనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త స్థానాలతో నియోజకవర్గాల స్థాయిలో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు ప్రవర్తనపై కోమటిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. వారు హుందాతనంతో ప్రవర్తించడం లేదని మండిపడ్డారు. నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తగిన విధంగా స్పందించడం లేదని ఆయన ఆక్షేపించారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తిరిగి అధికారంలోకి వచ్చే నమ్మకం లేకపోవడం వల్లే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని ఆరోపించారు. విపక్షం హుందాగా ప్రవర్తించి ప్రజలకు తగిన సలహాలు ఇవ్వాలని సూచించారు.