ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఆపిల్ ఐఫోన్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌లోని భద్రతా ఫీచర్స్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో ఐఫోన్ల తయారీను ఆపిల్ కంపెనీ మొదలు పెట్టాక సేల్స్ అమాంతం పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మకాల్లో ఆపిల్ కంపెనీ రికార్డుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఆపిల్ ఐఫోన్ అమ్మకాల్లో ఈ సంవత్సరం 11 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం 9 బిలియన్ల డాలర్ల మాత్రమే ఆదాయం ఆర్జించిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ఆపిల్ ఐఫోన్ 16ఈ ద్వారా ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు.

మార్కెట్‌లోకి 16ఈ లాంచ్
ఆపిల్ ఐఫోన్ 16 కంటే రూ. 20,000 తక్కువ ధరతో 16ఈ భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఆపిల్ గత సంవత్సరం భారతదేశంలో దాదాపు 12 మిలియన్ ఐఫోన్‌లను విక్రయించింది. ఈ సంఖ్య వివో, శామ్‌సంగ్ కంటే చాలా తక్కువ. కానీ ఐఫోన్ అమ్మకపు ధర పరిశ్రమ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అందువల్ల ఆపిల్ భారతదేశంలో అత్యధికంగా రెవెన్యూ సంపాదించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.
గట్టి పోటినిస్తున్నది
కొత్త ఐఫోన్ 16ఈ ధరతో పాటు ఫీచర్ల పరంగా వివో, శామ్‌సంగ్ కంపెనీ ఫోన్లకు గట్టి పోటినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆపిల్ ఈ సంవత్సరం దాదాపు 15 మిలియన్ యూనిట్ల ఐఫోన్‌లను విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16ఈ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
అధునాతన రైటింగ్ టూల్స్
ముఖ్యంగా ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ద్వారా అధునాతన రైటింగ్ టూల్స్, విజువల్ ఇంటెలిజెన్స్ వంటి ఏఐ ఆధారిత లక్షణాలు యూజర్లు అనుభూతి చెందుతారు. అదనపు ఫీచర్ల విషయానికి వస్తే యాక్షన్ బటన్, ఫేస్ ఐడీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటివి ఆకట్టుకుంటాయి. భారతదేశంలో ఐఫోన్ 16ఈ 128 జీబీ వేరియంట్ ధర రూ.59,900, 256 జీబీ వేరియంట్ ధర రూ.69,900, 512 జీబీ వేరియంట్ ధర రూ.89,900గా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 21న ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా ఫిబ్రవరి 28న ఈ ఫోన్ డెలివరీలు ప్రారంభం అవుతాయి.