కళాశాల ప్రవేశాలలో తెలుగు విద్యార్థులకు కోటా
తిరుమల : దేశ రాజధాని ఢిల్లీనగరంలో తిరుమలతిరుపతి దేవ స్థానం నడుపుతున్న శ్రీవేంకటేశ్వర కళాశాలలో విద్యార్థులకు ఉపాధి అవకాశం ఉన్న వృత్తిపరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు (B.R.Naidu) సూచించారు. కళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఎస్వీకళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి ఆధ్వర్యంలోని ఢిల్లీలోని ఎస్వీ కళాశాల 155వ సమావేశం తిరుపతిలోని పద్మావతి అతిధి గృహంలో టిటిడి ఛైర్మన్ బిఆర్నాయుడు, ఈఒ శ్యామలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి టిటిడి బోర్డుసభ్యులు డాక్టర్ పనబాకలక్ష్మి, శాంతారాం, ఎస్.నరేశ్ కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, టిటిడి ఎఫ్ఎసిఎఒ బాలాజీ, సిఇ సత్యనారా యణ, టిటిడి డిఇఒ వెంకటసునీల్, గవర్నింగ్ బాడీ ప్రతినిధులు పాల్గోన్నారు.
మౌళిక సదుపాయాలు
ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో బిఆరా నాయుడు మాట్లాడుతూ ఢిల్లీలోని కళాశాలలో టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా ఎస్వీకళాశాలను రూపొందించాలన్నారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వీకళాశాలలో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉత్తరాదివైపున ఉన్న టిటిడి ఆలయాల్లో, ఢిల్లీలోని ఎస్వీకళాశాలకు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఇఇ విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఛైర్మన్ నాయుడు ఈఒ శ్యామలరావు (EO Shyamala Rao) కు సూచించారు.కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగ పోటీపరీక్షలకు శిక్షణ నిచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
భవనాల పునర్నిర్మాణం
కళాశాలలో పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, ఇంజనీరింగ్ మరమ్మతులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. కాలంచెల్లిన భవనాల స్థానంలో భవనాల పునర్నిర్మాణం, ఆడిటోరియం మరమ్మతులు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీ (New technology) తో కళాశాల ప్రవేశాలలో మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్పులుచేర్పులు చేపట్టాలన్నారు. కళాశాలకు సంబంధించిన పలు అంశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ వఝుల రవి ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఒ దృష్టికి తీసుకువచ్చారు.