భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీ నాయక్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీ నాయక్(Murali Nayak) చిత్రపటానికి నివాళులు అర్పించారు. దేశం కోసం మురళీ నాయక్ త్యాగం చేశారన్న వైఎస్ జగన్ ఎంతోమందికి మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్(YS Jagan) రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు.మరోవైపు అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పద్ధతిని వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టామన్న వైఎస్ జగన్ ఈ ఆనవాయితీని కొనసాగించినందుకు టీడీపీ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) కూడా ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 50 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మురళీ నాయక్ కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్
మురళీనాయక్‌కు చిన్నతనం నుంచే సైన్యంలో పనిచేయాలని కోరిక. అదే కోరికతో కష్టపడి ఆర్మీలో చేరారు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి అగ్నివీర్ కింద ఆర్మీలో చేరారు. 2022 డిసెంబరులో అగ్నివీర్‌గా ఎంపిక అయిన మురళీ నాయక్ తొలుత పంజాబ్, అస్సాంలలో పనిచేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) వెళ్లిన మురళీ నాయక్ ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందారు. మరోవైపు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.
Read Also: Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?