ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరికీ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలువరించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సదుయం కల్పిస్తామని తాజాగా సీఎం చంద్రబాబు(CM ChandraBabu) పేర్కొన్నారు.కర్నూలులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు.మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఇప్పటికే కూటమి నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. మహిళలకు రవాణా ఖర్చులు తగ్గించడం, వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ సర్కార్(Ap Government) నిర్ణయం తీసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
నాణ్యమైన
ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూనే, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తామని తెలిపారు. ఇప్పటికే 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 4.51 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నామని, అన్న క్యాంటీన్ల(Anna Canteen)తో పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. “దీపం-2” కింద మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని, పాఠశాలలు తెరిచేలోగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని, “తల్లికి వందనం” కింద రూ.15 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని భరోసా ఇచ్చారు.రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించే లక్ష్యంతో 1998లో తాను ప్రారంభించిన రైతు బజార్ల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. ప్రస్తుతమున్న 125 రైతు బజార్ల సంఖ్యను పెంచుతామని, కర్నూలు(Kurnool)లోని రైతు బజార్ ఆధునికీకరణకు రూ.6 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.పాణ్యం నియోజకవర్గంలో రూ.50 లక్షలతో ఉద్యానవన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే, నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: AP Liquor Scam Case : ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి రిమాండ్