సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ప్రజలను కీలకంగా హెచ్చరించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లకు వచ్చే సందేశాల్లోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా “APK Files” రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని పేర్కొన్నారు.కొందరు సైబర్ నేరగాళ్లు కొద్దిరోజులుగా పీఎం కిసాన్ యోజన, ఎస్‌బీఐ ఈకేవైసీ, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు పేర్లతో మోసపూరిత లింక్స్ పంపిస్తున్నారన్నారు. ఆ ఏపీకే ఫైల్స్ లింక్‌లపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుందంటున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ కోరారు.
సైబర్ కేటుగాళ్లకు
ముఖ్యంగా ఏపీలో రైతుల్ని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. పీఎం కిసాన్ పేరుతో వాట్సాప్ ద్వారా నకిలీ ఏపీకే లింక్‌లను పంపిస్తున్నారు. పొరపాటున వాటిని క్లిక్ చేయగానే మొబైల్‌లో వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ కేటుగాళ్లకు చేరుతోంది. ఇటీవల సత్యసాయి జిల్లాలో ఒక రైతు ఇలా మోసపోయాడు, పీఎం కిసాన్ యోజన (Pm Kisan Yogana) పేరుతో వచ్చిన ఫేక్ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేశాడు. ఆ వెంటనే ఆ రైతు బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.94 వేలు పోయాయి. ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని గుర్తించారు.ఈ క్రమంలో ఏపీలో సైబర్ విభాగం సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta).

సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
ప్లే ప్రొటెక్ట్ సదుపాయాన్ని ఆన్ చేసుకోవాలని అలాగే ముందస్తు జాగ్రత్తగా నార్టన్, బిట్ డిఫెండర్, అవాస్ట్ వంటి యాంటీ వైరస్ యాప్‌లను ఉపయోగించాలని సూచించారు.సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను క్లిక్ చేయొద్దని ఏపీ డీజీపీ (AP DGP) హెచ్చరించారు. అంతేకాదు అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.’రాష్ట్రంలో సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలు అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాము’ అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీకే లింక్స్ క్లిక్ చేయొద్దని సూచించారు.
Read Also: South Central Railway: ఇకపై ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేస్తే జైలు శిక్ష తప్పదు