ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ రైతన్నలకు శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా నిధుల్ని విడుదల చేసింది. ఖరీఫ్ సాగుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాటా అయిన 50 శాతం మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన నిధులని ప్రభుత్వం విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్(Kharif season) బీమా మొత్తానికి అవసరమైన రూ.132.58 కోట్ల నిధుల్ని విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులకు మేలు కలగనుంది. దీని వల్ల పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.
పథకాలు
రైతన్నలకు పంటల బీమా పథకం వల్ల మేలు కలగనుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం ఏర్పడితే వారిని ఆదుకునేందుకు సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ(Input subsidy) అందించేందుకు ఈ బీమా పథకాలు ఉపయోగపడతాయి. దీనిలో భాగంగానే కూటమి సర్కార్ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రీమియంలో తన వాటా మొత్తం చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. కేంద్రం వాటాతో కలిపి ఈ ప్రీమియాన్ని బీమా అందించే సంస్థలకు చెల్లిస్తారు. ఇవి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటుంది.
పెట్టుబడి
రైతులను ఆదుకునేందుకు వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకోసం కూటమి సర్కార్ ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ(Annadaatha Sukhibava Scheme) కింద అర్హులైన ప్రతి రైతుకి ఏటా రూ. 20 వేలు అందించనున్నారు.ఈ మొత్తాన్నిమూడు విడతల్లో రైతు ఖాతాలో జమ చేస్తారు. అయితే ఈ 20 వేల రూపాయల్లో కేంద్రం పీఎంకిసాన్ కింద ఇచ్చే రూ. 6 వేలు కూడా కలిసి ఉంటాయి. కేంద్ర సాయాన్ని మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకి ఏటా రూ.14 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. త్వరలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులని విడుదల చేయనున్నారు.
Read Also: AP IT: ఏపీలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్.. ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ