ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో పెళ్లికి సిద్ధమైన యువకుడు ఊహించని విధంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు పెద్దల్ని పెళ్లికి ఒప్పించాడు. ఊహించని విధంగా పెళ్లి పీటాలు ఎక్కాల్సిన వరుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. పెళ్లికి ఒకరోజు ముందు ప్రాణాలు ఎందుకు తీసుకున్నాడని ఆరా తీస్తే సంచలన విషయాలు తెలిశాయి. పాపం పెళ్లి సంప్రదాయమే ఆ యువకుడి ప్రాణాలు తీసిందని తెలుసుకుని అందరూ కన్నీటిపర్యంతం అయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాలు
ఆదోని మండలం హనువాళుకు చెందిన రాజు తల్లిదండ్రులు గోరంట్ల, ఈరమ్మతో కలిసి హొళగుందలో నివాసం ఉంటున్నాడు. రాజు హొళగుంద మండలం ఎండీ హళ్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇరు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల 16న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందు రోజు హొళిగుంద(Holigunda)లో రాజు ఇంటి ముందు పందిరి కూడా వేశారు. ఈ క్రమంలో పెళ్లికి ముందు రోజు పూజలు చేసేందుకు వరుడు రాజు ఆలయానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగాడు.రాజును గమనించిన బంధువులు వెంటనే ఆదోని ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి డాక్టర్ల సూచన మేరకు వెంటనే కర్నూలులోని(Kurnool) ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. వరుడు రాజు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజు తల్లి ఈరమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు కుటుంబ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రాజు ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన రాజు ఇలా ప్రాణాలు తీసుకోవడం ఆ ఊరిలో, యువతి కుటుంబంలో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న కారణానికే ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏంటని తల్లిదండ్రులు పర్యంతం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంటల్ లో భారీ అగ్నిప్రమాదం