CM Chandrababu: శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

Read Time:  1 min
CM Chandrababu: శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
FONT SIZE
GET APP

CM Chandrababu: శ్రీకాకుళంలో కలుషిత నీటి వల్ల డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.

Read Also: CM Chandrababu : రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

ముందస్తు పర్యవేక్షణే శ్రీరామరక్ష

“ఘటన జరిగాక స్పందించడం కంటే, అది జరగకుండా చూడటమే ముఖ్యం” అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ముందస్తు తనిఖీలు నిరంతరం జరగాలని, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. అధికారులు, ప్రజల్లో ఉంటేనే క్షేత్రస్థాయి సమస్యలు తెలుస్తాయని, అప్పుడే వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి విభాగంలో కిందిస్థాయి యంత్రాంగాన్ని క్రియాశీలకం చేయాలని ఆదేశించారు.

CM holds high-level review on Srikakulam and Rajahmundry incidents
CM holds high-level review on Srikakulam and Rajahmundry incidents

సమీక్షలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను సీఎంకు వివరించారు. “జిల్లాలో ఇప్పటి వరకు 129 డయేరియా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 107 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పైపుల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన నీటిని అందిస్తున్నాం. నాలుగు ఇంజనీరింగ్ బృందాలు 40 లీకులను గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు.

150 మంది సిబ్బంది, 7 జేసీబీలు, 10 ట్రాక్టర్లతో పారిశుద్ధ్య పనులు చేపట్టాం. విశాఖ నుంచి మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ను తరలిస్తున్నాం. ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ పనిచేసేలా మెడికల్ క్యాంపులు, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం” అని తెలిపారు. స్థానికులు వాటర్ ట్యాంకులు శుభ్రం చేసుకోకపోవడం, పైప్‌లైన్లు డ్రైన్లను క్రాస్ అవ్వడం, నీటి ప్రెజర్ లేకపోవడంతో మోటార్లు పెట్టి నీటిని తోడటం వల్ల కలుషిత నీరు ఇళ్లకు చేరిందని ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు వివరించారు.

రాజమండ్రి ఘటనలో 8 మంది పరిస్థితి విషమం

అనంతరం రాజమండ్రి కల్తీ పాల ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సీఎంకు వివరాలు అందించారు. ‘‘ఈ నెల 22న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో 20 మంది అనారోగ్యం పాలుకాగా, ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో 8 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో 9 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. 957 మందిని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాం.

నిందితుడైన పాల సరఫరాదారు గణేశ్వరరావును అరెస్ట్ చేసి విచారిస్తున్నాం. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఇతర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను, పరికరాలను తెప్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం’’ అని కలెక్టర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని అధికారులు తెలిపారు.ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం, రాజమండ్రి ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల ఎస్పీలు కూడా పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.