Bhanu Prakash Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వ్యవహారాల్లో వైసీపీ నేతలు కావాలనే గందరగోళం సృష్టిస్తూ,
పాలనను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసి, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయినందువల్లే ఇటువంటి కుట్రలతో రాజకీయ దాడులకు దిగుతోందని ఆయన విమర్శించారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం భారత దేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి.
ఇలాంటి ఆలయం పరిపాలనపై విమర్శలు చేస్తూ, నకిలీ వార్తలు, వీడియోలతో ప్రజల్లో భ్రాంతులు కలిగించాలన్న వైసీపీ ప్రయత్నం తగదని ఆయన స్పష్టం చేశారు.
భానుప్రకాశ్ రెడ్డి లేఖలో చెప్పినదాని ప్రకారం, ఇటీవల టీటీడీపై వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తూ, గోశాల నిర్వహణపై అసత్య సమాచారాన్ని ప్రచారం చేశారని తెలిపారు.
టీటీడీ (TTD) గోశాలలో వందలాది ఆవులు చనిపోయాయని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్
భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు.
కానీ అవన్నీ నమ్మదగని, అవాస్తవమైనవని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వాటిని కావాలనే విడుదల చేశారని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా, వైసీపీ నాయకులు తిరుమల కొండపై ఒక వ్యక్తితో అన్యమతానికి సంబంధించిన ప్రార్థనలు చేయించి,
ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
క్యూ లైన్లను సరిగ్గా నిర్వహించడం లేదని, భక్తులను సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని టీటీడీ సభ్యుడు పేర్కొన్నారు.
టీటీడీ పరిపాలనపై దాడి ద్వారా ఎన్డీయేను లక్ష్యంగా?
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలు రాజకీయంగా నిరుద్యోగులుగా మారారని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు.
“ఈ ఘటనలు యాదృచ్ఛికంగా లేదా అకస్మాత్తుగా జరిగినవి కావు. ఇవి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న నేరపూరిత కుట్ర అని నేను అనుమానిస్తున్నాను.
ఈ కుట్ర వెనుక వైసీపీ అగ్ర నాయకుల హస్తం ఉందని కూడా నేను భావిస్తున్నాను” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
దర్యాప్తు జరిపించాలి – డీజీపీకి విజ్ఞప్తి
ఈ పరిస్థితుల్లో టీటీడీ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని,
దీని వెనుక ఉన్న కుట్రలను పూర్తిగా వెలికితీయాల్సిన అవసరం ఉందని భానుప్రకాశ్ రెడ్డి డీజీపీని కోరారు.
ఈ కుట్రలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కాదని, ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నవని,
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు.
టీటీడీ వంటి విశ్వసనీయ సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదని, ఈ అంశంపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.