కొత్త దిశలో ఏపీ రేషన్ విధానం – బియ్యం స్థానంలో నగదు?
Andhra pradesh: ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ విధానంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన వెంటనే కొన్ని వినూత్న ప్రతిపాదనలు తీసుకువచ్చింది.
ముఖ్యంగా బియ్యం స్థానంలో నగదు చెల్లింపు ప్రతిపాదనపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
కోనసీమ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, ఎవరైనా లబ్దిదారులు రేషన్ బియ్యం లేదా ఇతర సరుకులు అవసరం లేదని చెబితే, దానికి బదులుగా వారికి నగదును నేరుగా ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
బియ్యం వద్దన్న వారికి నగదు.. కానీ ఎంత?
Andhra pradesh: ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మార్పులో, రేషన్ తీసుకోని లబ్దిదారులకు నగదు చెల్లింపు ఎలా ఉంటుంది? కిలో బియ్యానికి ఎంత మొత్తం లెక్కగడతారు? అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
ప్రజా ఫిర్యాదుల కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చ జరగడం గమనార్హం.
రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డు కూడా లింక్ అయి ఉండటంతో, కొంతమంది పౌరులు కార్డు తీసుకొని బియ్యం అమ్ముతున్నారని అధికారుల నివేదిక.
దీన్ని నివారించేందుకు, ఆరోగ్యశ్రీ – రేషన్ కార్డుల అనుసంధానాన్ని వేరుచేయాలనే సూచన వచ్చింది. బియ్యం అవసరం లేని వారు స్వచ్ఛందంగా రేషన్ కార్డులు వెనక్కి ఇవ్వాలని సూచించారు.
రేషన్ షాపుల్లో కొత్త దిశలు.. మిల్లెట్స్, కూరగాయలు కూడా?
రేషన్ షాపుల్లో కేవలం బియ్యం కాదు, మిల్లెట్స్, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచాలనే ఆలోచనపై కూడా చర్చ కొనసాగుతోంది.
ఈ మార్గం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు మరింత పోషకాహారాన్ని అందించవచ్చునని భావిస్తున్నారు.
దీనితో పాటు, రైతులకు మద్దతు ధర లభించేలా రేషన్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఉద్దేశమున్నది.
ప్రభుత్వం ఏడాదికి రూ.5,100 కోట్లకు పైగా రేషన్ పై ఖర్చు చేస్తోంది. అయితే బియ్యం తీసుకోని వారు రేషన్ కార్డులను వెనక్కి ఇస్తే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
హెల్త్ కార్డు – రేషన్ కార్డు.. వేరుచేయాలా?
ప్రతి కుటుంబానికి వేరుగా ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్ కార్డులు ఉండాలని ప్రజా ఫిర్యాదుల కమిటీ స్పష్టం చేసింది. హెల్త్ కార్డు పొందేందుకు రేషన్ అవసరం లేకుండా చేయాలని సూచించారు.
ఈ వేర్పాటు వల్ల బోగస్ లబ్దిదారుల వ్యవహారాన్ని నియంత్రించవచ్చునని విశ్వాసం వ్యక్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలుండగా, అందులో 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు సమాచారం.
దీని ఆధారంగా ప్రభుత్వ నిధుల వినియోగంపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
తుది నిర్ణయం కేబినెట్ చేతిలో
ఇప్పుడు ఈ ప్రతిపాదనలు ఏపి క్యాబినెట్ ముందు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే మంత్రివర్గ భేటీలో రేషన్ కార్డులు, నగదు బదిలీ, ఆరోగ్యశ్రీ కార్డు వేర్పాటు వంటి అంశాలపై తుది నిర్ణయం వచ్చే అవకాశముంది.
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ విధానాలు రూపొందించబడుతాయా? లేదా అనేది త్వరలో తేలనుంది.
Read Also: TTD: లడ్డూ కేసులో వెలుగులో కీలక అంశాలు