తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం లేని పేరు కాదు వాసుగి. తనదైన హావభావాలతో, సమయోచిత కామెడీ టైమింగ్‌తో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, నేడు జీవిత పోరాటంలో కన్నీటితో కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా 1991లో వచ్చిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో ‘పాకీజా’ (Pakeezah) అనే పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.కానీ ఆ తరువాత కాలంలో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడం, కుటుంబ పరిస్థితులు కుదుటపడకపోవడంతో నిత్యం పోరాటమే జీవితం అయ్యింది. ఇప్పుడు పూట గడవని దీనస్థితిలో కొన్నిసార్లు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమిళనాడులో ఆదరణ కరువవడంతో ఏపీ ప్రభుత్వం తనను ఆదుకుంటుందన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి
చెన్నై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాసుగిని గుంటూరులో మీడియా ప్రతినిధులు పలకరించారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రస్తుత దుర్భర పరిస్థితిని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. “తమిళనాడు (Tamil Nadu) లో నా పరిస్థితిని వివరిస్తూ వీడియోలు తీసి ఎందరో నటులకు పంపినా ఎవరూ స్పందించలేదు. కానీ తెలుగు సినీ పరిశ్రమలోని చిరంజీవి, నాగబాబు, మోహన్ బాబు కుటుంబాలు నన్ను ఆదుకున్నాయి. ఒకవేళ వారు కూడా ఆదుకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని” అని ఆమె తెలిపారు.వాసుగి స్వస్థలం తమిళనాడులోని కారైకుడి.
కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు
మోహన్‌బాబు హీరోగా వచ్చిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో పాకీజా పాత్ర ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘రౌడీగారి పెళ్లాం’, ‘పెదరాయుడు’, ‘అన్నమయ్య’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అప్పటి తమిళనాడు సీఎం జయలలిత (Jayalalithaa) పిలుపు మేరకు ఆమె అన్నాడీఎంకే పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.
జయలలిత తర్వాత తనను పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన
రాజ్‌కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయని వాసుగి వాపోయారు. అత్తమామల వేధింపులు, భర్త మద్యానికి బానిసై ఆస్తులు కరిగించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. కొంతకాలానికి భర్త ఆత్మహత్య చేసుకోవడంతో అత్తమామలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె కన్నీళ్లతో చెప్పారు. ఉన్న కొద్దిపాటి డబ్బును క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి చికిత్స కోసం ఖర్చుచేశానని వివరించారు. తన రాజకీయ గురువైన జయలలిత మరణం తర్వాత తనను పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదుకోవాలి
తెలుగువారే నాకు అన్నం పెట్టారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే నన్ను ఆదుకోవాలి. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి నా గోడు వెల్లడించుకోవాలని ఉంది. నాకు ఒక పింఛన్ సౌకర్యం కల్పిస్తే బతికినంత కాలం వారి పేరు చెప్పుకుని జీవిస్తాను. అవసరమైతే వారి కోసం ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేస్తాను” అని వాసుగి విజ్ఞప్తి చేశారు.
Read Also: Shefali Jariwala: గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి