ట్రైన్లో మైనర్ బాలికను 25 ఏళ్ల యువకుడు లైంగికంగా వేధించడమే కాకుండా వీడియోలు చిత్రీకరించిన దారుణ ఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఒక్కసారిగా యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తీవ్ర భయాందోళనకు గురైంది. ఇంతకీ బాలికను నిందితుడు ఏ విధంగా వేధింపులకు గురిచేశాడు.
బాత్రూమ్‌లోనే బాలికపై లైంగిక వేధింపులు
హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి ఒడిస్సా నుంచి ఓ కుటుంబం హైదరాబాద్‌కు బయలుదేరింది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాలిక కుటుంబం హైదరాబాద్‌కు పయనమైంది. ఈ క్రమంలో అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో మైనర్ బాలిక ట్రైన్‌లో వాష్ రూమ్‌కు వెళ్లింది. బాలిక ఒంటరిగా వెళ్లడాన్ని చూసిన ఓ వ్యక్తి ఆమెను ఫాలో అయ్యాడు. బాత్రూమ్‌లోనే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దుండగుడు. అంతటి ఆగకుండా తాను చేస్తున్న ఘోరాన్ని, బాలిక దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డు చేశాడు నిందితుడు. దుండగుడి వేధింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. దీంతో వెంటనే బాలిక తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు
నిందితుడు హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని, నిందితుడిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. అలాగే బాలికకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వెంటనే దుండగుడు లైంగిక దాడికి దిగడంతో బాలిక ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైంది. హైదరాబాద్‌లోని ప్రదేశాలను చూసేందుకు వస్తున్న బాలికపై దుండగులు ఇలాంటి దారుణానికి పాల్పడటం సంచలనంగా మారింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై రైల్వే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.