న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రి.. పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా ఓటింగ్‌కు 5 రోజులు ఉండగా.. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు బిగ్ షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ పంపించారు. ఈ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించకపోవడంతోనే.. పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని.. ఆ లేఖలో ఎమ్మెల్యేలు వెల్లడించారు. గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ఏడుగురికి ఈసారి పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్.. త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్.. జనక్‌పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి.. కస్తుర్బానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ.. పాలం ఎమ్మెల్యే భావన గౌడ్.. బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్.. శుక్రవారం ఆప్‌కు రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పాలెం ఎమ్మెల్యే భావ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కేజ్రీవాల్‌పై నమ్మకం పోయిందని పేర్కొన్నారు.
ఇక మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖురాన్ అపవిత్రం కేసులో నరేష్ యాదవ్‌ను గతేడాది డిసెంబరులో పంజాబ్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ ఈ తీర్పుపై నరేష్ యాదవ్ స్టే తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విడుదల చేసిన ఐదో జాబితాలో మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ స్థానంలో మహేందర్ చౌదరిని అభ్యర్థిగా ఆప్ ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.