ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game 3) జూన్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి హాడావుడి చేస్తోంది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి సంచలన విజయం సాధించిన ఈ సిరీస్ ప్రతీసారి ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్‌ను అందించింది. లీ జంగ్ జే (Lee Jung-jae), పార్క్ హే సూ, హోయాన్ జంగ్‌లతో పాటు యిమ్ సి-వాన్ (Im Si-wan), కాంగ్ హా-న్యూల్, పార్క్ గ్యు-యంగ్, లీ జిన్‌లు కీలక పాత్రల్లో నటించారు. హ్వాంగ్ డాంగ్-హ్యూక్ (Hwang Dong-hyuk) దర్శకత్వం వహించాడు. మరి కొత్తగా వచ్చిన ఫైనల్ సీజన్ ఎలా ఉందో చూద్దాం. మొదటి సీజన్‌లో.. స్క్విడ్ గేమ్ గెలిచిన 456 నంబర్ ప్లేయర్ తిరిగి ఆ గేమ్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని, అందులోని ప్లేయర్స్‌ను రక్షించాలని, అక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ముందస్తుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడ కొంతమందితో టీమ్‌గా ఏర్పడి గేమ్ నిర్వాహకులపై ఎదురు దాడికి దిగుతాడు. కానీ వాళ్లలో చాలామంది చనిపోగా 456 నంబర్ ప్లేయర్ పట్టుబడి మళ్లీ గేమ్ ఆడాల్సిన పరిస్థితితో రెండో సీజన్‌ను ముగించారు. ఇప్పుడీ ఈ మూడో సీజన్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో ఒక్కొక్కటి గంట నిడివితో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

కథనం – మలుపులు
Squid Game 3: తిరిగి గేమ్‌లోకి వచ్చిన హీరో, తన పొరపాటు వల్లే అంతమంది చనిపోయారనే బాధలో ఉంటూ అక్కడున్న వాళ్లకు దూరంగా ఉంటుంటాడు. మరోవైపు అక్కడి గార్డ్స్‌లో ఒకరు గాయపడిన ఓ ప్లేయర్‌ను చనిపోకుండా రక్షించి అక్కడి లీడర్‌పై దాడికి సిద్ధమౌతుంది. మరోవైపు మేనేజ్‌మెంట్ చివరగా మూడు గేమ్స్‌ను స్టార్ట్ చేస్తుంది. కాగా అప్పటికే గర్బవతిగా ఉన్న నం 222 బిడ్డకు జన్మనిస్తుంది. అదేవిధంగా అప్పటివరకు కలిసి ఉన్న తల్లీ కొడుకుల జంట విడిపోయి ఆడాల్సి రావడం, కొడుకు చనిపోవడం జరుగుతాయి. అంతకుముందు జరిగిన ఘటనలో నీ తప్పేం లేదని ఇకపై నం 222, తన బిడ్డను రక్షించే బాధ్యత తీసుకోవాలని వృద్ధ తల్లి నిరుత్సాహంగా ఉన్న హీరోకు చెప్పి సూసైడ్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే బయటి నుంచి ఈ గేమ్‌ను కండక్ట్ చేసేందుకు డబ్బులు చెల్లించే పలువురు వీఐపీలు అక్కడకు స్వయంగా వచ్చి అక్కడి గేమ్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటూ, ఆపై ఆటను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ బాధ్యతను హీరోకు ఇచ్చి తల్లి సైతం ఆటలో చనిపోతుంది. దీంతో తల్లి స్థానంలో ఆ పాపను నం 222గా పరిగణిస్తూ ఆ ఆటలో ప్లేయర్‌గా లెక్కేస్తారు. దీంతో అక్కడి ప్లేయర్స్ ఎలాగైనా ఆ పాపను చంపితే ఆ భాగం మాకే వస్తుందనే ఆశతో ఆ పాపను టార్గెట్ చేయడం హీరో ఒంటరిగా ఆ బేబీని రక్షిస్తూ ఉంటాడు. రెండో గేమ్‌కు వచ్చేసరికి బేబీతో కలిపి కేవలం 9 మంది మాత్రమే మిగులుతారు. అందులో సెల్ఫిష్ అయిన పాప తండ్రి కూడా ఉంటాడు. ఇక చివరి ఫైనల్ గేమ్‌కు వచ్చేసరికి హీరో, పాప, ఆ పాప తండ్రి ముగ్గురు మాత్రమే బరిలో ఉంటారు.

ముగింపు – రివ్యూ
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురిలో ఎవరు బతికారు, ప్రైజ్‌మనీ ఎవరికీ వచ్చింది, పోలీసులు ఆ గేమ్ జరిగే ప్రాంతాన్ని కనుగొనగలిగారా లేదా తిరగబడ్డ ఆ గార్డ్ ఏం చేసింది అనే ఆసక్తికర కథకథనాలతో ఈ సిరీస్ సాగుతుంది. అయితే మొదటి రెండు సీజన్‌ల కన్నా ఈ ఫైనల్ సీజన్‌లో ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్ చాలామందికి అనేక రకాల జవాబులు ఇస్తుంది. మనుషులు సొంతవారైనా ఏ క్షణానికి ఎలా ఉంటారనే పాయింట్‌ను మరోసారి బలంగా చూపించారు. అక్కడక్కడ లాగ్ అనిపించినా ఇప్పుడీ ఫైనల్ సీజన్ శుక్రవారం (జూన్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో కొరియన్ భాషతో పాటు తెలుగు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది. ఎక్కడా ఎలాంటి అశ్లీల సన్నివేశాలు లేవు, ఎక్కడో ఓ చోట రెండు మూడు భూతులు వస్తాయి తప్పితే ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయవచ్చు. ముగింపులో ఇచ్చిన హింట్స్‌తో ఈ సిరీస్‌కు ముగింపు లేదు, కంటిన్యూ అవుతుందనేలా ఉండడం గమనార్హం.
Read also: Oka Pathakam Prakaram: ఓటీటీలో అదరకొడుతున్న ‘ఒక పథకం ప్రకారం’ ఎక్కడంటే?