ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో కుంభమేళా ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఇవాళ ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు ఆచరించారు.
మాఘ పౌర్ణమి రోజు రెండు కోట్ల మంది భక్తులు
మాఘ పౌర్ణమి సందర్భంగా నిన్న ఒక్కరోజే 2 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఈ మహాకుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 48.25 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించారు.

భక్తులతో క్రిక్కిరిసి త్రివేణి సంగమం
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది.
గది అద్దె గంటకు రూ 5,000
మహా కుంభమేళాకు రోజూ లక్షలాదిగా భక్తులు తరలివస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మహా కుంభ్‌ను సందర్శించిన కొందరు భక్తులు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
సంగం వద్దకు వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలు, ఇతరవాహనాలు వందల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని దినేశ్ రాణా అనే భక్తుడు వాపోయాడు. సాధారణ హోటల్ ధరలు సైతం ఫైవ్ స్టార్ రేట్లను మరపిస్తున్నాయి. ఒక్కో గదికి గంటకు రూ. 5,000 చొప్పున వసూలు చేస్తున్నారు.