చండీగఢ్ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు పరిష్కారం చూపేందుకు జోక్యం చేసుకోవాలని కోరేందుకు రాష్ట్రపతి ముర్ముతో భేటీకి ఎస్కేఎం ప్రతినిధులు సోమవారం సమయం కోరారు. సమయం కేటాయించాలని కోరుతూ తాము చేసిన అభ్యర్థనకు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చినందుకు ఎస్కేఎం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపింది.
సమయాభావం కారణంగా రైతుల ప్రతినిధులను కలుసుకోవడానికి ఆమె నిరాకరించడం పట్ల ఎస్కేఎం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు పరిష్కరించలేక పోయిన ఈ ప్రతిష్టంభనను తొలగించి, గత 41 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలను కాపాడేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టేందుకు వీలుగా రైతుల ఆందోళన విషయంలో జోక్యం చేసుకోవాలన్న తమ అభ్యర్థనను రాష్ట్రపతి భవన్ సమీక్షించగలరని ఎస్కేఎం ఆశాభావం వ్యక్తం చేసింది. సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉందని పేర్కొంది.