వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. భార్గవరెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, టీడీపీ, జనసేన నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును భార్గవ్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. రెండు వారాల పాటు భార్గవరెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొనసాగుతున్న కేసులు
కాగా వైసీపీ నేతలపై టీడీపీ కేసుల పరంపరలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. కొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.