ఇటీవల కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక సమస్య , డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ..ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద ఘటన వెలుగులోకి వస్తుండడం తో ప్రయాణికులు రైలు ప్రయాణం అంటేనే వామ్మో అంటున్నారు. తాజాగా తెలంగాణ లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. పెద్దపల్లి – రాఘవాపూర్ దగ్గర మంగళవారం రాత్రి సమయంలో ఓవర్ లోడ్ కారణంగా ఆరు గూడ్స్ భోగీలు పట్టాలు తప్పాయి.
దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు తెలియజేశారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక మూడు రోజుల క్రితం రైలు ఇంజిన్ – బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా బరౌనీ రైల్వే జంక్షన్‌లో షంట్ మ్యా్న్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ రౌత్ (35) రైలు ఇంజిన్, పార్సెల్ వ్యాన్ బోగీ మధ్య కప్లింగ్‌ను జత చేస్తుండగా.. లోకో పైలట్ ఒక్కసారిగా రైలు ఇంజిన్‌ను వెనక్కి పోనిచ్చాడు. దీంతో అరుణ్ కుమార్.. రైలు ఇంజిన్, బోగీ మధ్య చిక్కుకొని నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. లోకో పైలట్ జరిగిన ప్రమాదాన్ని గమనించి ఇంజిన్‌ను ముందుకు నడిపే ప్రయత్నం కూడా అలాగే వదిలేసి.. ఇంజిన్ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. అరుణ్ కుమార్ విలవిల్లాడుతూ క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారకర ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొంత మంది ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.