హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తమకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ , బెంగుళూర్ కాదని న్యూయార్క్ సిటీతోనే పోటీ అని సీఎం రేవంత్ అన్నారు. తాజాగా ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడేలా ముందుకు సాగుతామని , బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలతో పోటీ పడితే మజా ఏమంటుందన్నారు.
ప్రస్తుతం ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని, కాబట్టి ప్రపంచ నగరాలతో పోటీ పడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు పెడితే… అభివృద్ధి చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఇతరుల చేతుల్లో ఉన్న వాటిని లాక్కొని అదానీకి ఇవ్వాలని తమకు లేదన్నారు. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, వాటిని క్రమంగా అమలు చేస్తున్నామన్నారు. తాను ఏడో గ్యారెంటీగా డెమోక్రసీని తిరిగి తెస్తానని ప్రజలకు హామీ ఇచ్చానన్నారు. 2004-2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్ మోడల్ ప్రచారం కోసం కేంద్రం తరపున పూర్తి సహకారం అందించారని, అందుకే ఆరోజు సీఎంగా ఉన్న మోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేసుకోగలిగారన్నారు.
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయన్న బీజేపీ 240 సీట్లు సాధించింది. కాంగ్రెస్ స్థానాలు 40 నుంచి వందకు చేరింది. నెంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. ప్రతి దానికి మోదీ ముద్ర వేశారు. మోదీ గ్యారంటీ అన్నారు. మోదీ గ్యారంటీకి వారంటీ పూర్తయిందని నేను ఎన్నికలకు ముందే చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీశ్ కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తుందన్నారు సీఎం. బీజేపీ అన్నదాతలకు వ్యతరేకంగా పనిచేసిందని ఆరోపించారు. రాజ్యాంగం రద్దుకు మోదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించిందో ప్రజలకు చెప్పగలిగామన్నారు. బీజేపీ రహస్య అజెండాను బయటపెట్టామన్నారు. బీజేపీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల ముందు చెప్పే అజెండా వేరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.