హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మూసీ పునరుజ్జీవం యాత్రతో మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళ్లనున్నారు. తన జన్మదినం నవంబర్ 8 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం శ్రీకారం చుట్టారు. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ కానుంది. ఈ నెల 8న కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
అనంతరం వైటీడీఏ , జిల్లా అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర చేయనున్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు సీఎం. తరువాత మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యవేక్షించనున్నారు.